టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రామ్ చరణ్‌ను పూర్తి గ్రామీణ మాస్ అవతార్‌లో చూపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా కథ 1980ల కాలం నేపథ్యంలో సాగుతుందని, స్పోర్ట్స్ మరియు ఎమోషనల్ డ్రామా కలయికగా ఉండబోతుందని సమాచారం.
తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘పెద్ది’ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చిత్రబృందానికి భారీ ఉత్సాహాన్ని ఇచ్చిందట. ప్రారంభ దశలోనే మంచి ప్రీ-సేల్స్ నమోదు కావడంతో, ఈ సినిమా విదేశీ మార్కెట్‌లో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ అందిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, సినిమాకు మరింత హైప్ పెంచాయి.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. మొత్తానికి, ‘పెద్ది’ విడుదలకు ముందే భారీ బిజినెస్, ఓవర్సీస్ క్రేజ్‌తో వార్తల్లో నిలుస్తోంది. కాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.