ఎవరో ఒకరు అడిగేంతవరకు.. వ్యవస్థ అలా సాగిపోతూ ఉంటుంది. ఎవరైనా అడిగితే ఆలోచనలో మార్పు వచ్చి.. మార్పు మొదలవుతుంది. మార్పు రాకపోయినా.. మనం చేస్తున్నది కరెక్టేనా? నడుస్తున్న దారి సరైనదేనా? అనే ప్రశ్న అయినా కనీసం వస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రశ్ననే వేశారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. తన తనయుడు అఖిల్ ‘లెనిన్’ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా ఆయన ఈ మేరకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో నిజమే కదా.. ఇదే కదా టాలీవుడ్‌లో మిస్ అయింది అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది.
నాగార్జున ఈ మీట్‌లో మాట్లాడుతూ సినిమా గురించి, అఖిల్ పడ్డ కష్టం గురించి, సినిమా సాధించిన విజయం గురించి మాట్లాడారు. అయితే, ఆయన అక్కడితో ఆగలేదు. సినిమా రిలీజ్ డేట్‌లు, వాయిదాల గురించి కుండ బద్దలుకొట్టారు. క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ఒడిస్సి’ గురించి మాట్లాడారు. అలాంటి పెద్ద సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ఇచ్చి దానికి కట్టుబడి రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే తనతో సహా టాలీవుడ్‌లో చాలా సినిమా నిర్మాణ సంస్థలు మాట మీద నిలబడలేకపోతున్నాయని అన్నారు.
సినిమా విడుదలను వరుస వాయిదాలు వేస్తున్నారని, కనీసం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ ఇస్తే బాగుంటుందని నాగ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాగ్ ఈ మాటలు ఏదో మాట వరసకు అన్నట్లుగా అనిపించడం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా మోజులో నిర్మాణం విషయం కాస్త పట్టు తప్పింది. నాలుగైదు రిలీజ్ డేట్లు మారకుండా ఏ పెద్ద సినిమా కూడా బయటకు రావడం లేదు. ఆ మాటకొస్తే చిన్న సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఒకరిద్దరు దర్శకనిర్మాతలు ఇలా టైమ్‌కి రిలీజ్ చేస్తున్నారు.
దీంతో నాగార్జున చెప్పిన పాయింట్ మనసుకు తీసుకొని సినిమాను టైమ్‌కి ఎలా రెడీ చేయాలో చూడాలి. ఇక్కడ ఏ ఒక్కరినో కాదు. మొత్తం అన్ని విభాగాలూ ఆలోచించుకోవాలి. వారి వల్ల ఆలస్యమవుతోంది, వీరి వల్ల ఆలస్యమవుతోంది అనకుండా.. ఏ ఇబ్బంది లేకుండా సినిమా రిలీజ్ చేయాలి. అవసరమైతే రిలీజ్ డేట్ కాస్త లేట్‌గా అనౌన్స్ చేయాలి కానీ ‘చెప్పిన డేట్‌కి సినిమా రాని వుడ్ టాలీవుడ్’ అనే పేరు తెచ్చుకోకూడదు.