హైదరాబాద్‌లో సినిమా ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా వ్యూవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది అల్లు సినిమాస్. ఈ మల్టీప్లెక్స్‌లోని ఓ స్క్రీన్‌లో డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో సినిమా చూడొచ్చనే విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా థియేటర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ఫార్మాట్‌లో తెలుగు సినిమా ఏదైనా త్వరగా వస్తే బాగుండు అంటూ సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. వారికి తీపి కబురు చెబుతూ రెండు సినిమాలు ఆసక్తికర విషయాన్ని అనౌన్స్ చేశాయి.
రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాను డాల్బీ సినిమాస్ ఫార్మేట్‌లో విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు ప్రకటించాయి. కథా నేపథ్యం, భారీస్థాయి యాక్షన్ అంశాలు, ఎమోషన్స్ రూపొందుతున్న సినిమాను మీకు మరింత నాణ్యతతో, ప్రత్యేకమైన అనుభూతితో అందించడానికి డాల్బీ సినిమా సాంకేతికను జోడించామని టీమ్ ఘనంగా ప్రకటించింది. దీంతో వచ్చే నెల 30న బావ థియేటర్‌లో చరణ్ సందడి ఉండనుంది.
అయితే వచ్చే నెలవరకు ఆగాలా అనే డౌట్‌కి ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కల్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్ ఎంట్రీ ఇచ్చింది. తమ సినిమాను కూడా డాల్బీ సాంకేతికతతోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఈ నెల 19న ఉగాది సందర్భంగా విడుదల కానున్నవిషయం తెలిసిందే. మరి కొత్త టెక్నాలజీ, కొత్త స్క్రీన్‌లో ‘ఉస్తాద్..’ ఎలా అదరగొడతాడో చూడాలి.