తెలుగు సినిమాల్లో బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు అంటూ ఓ లిస్ట్ రాస్తే.. అందులో కచ్చితంగా ఉండే సినిమాలు ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలు. స్టార్ నటుల బ్యాకప్ లాంటిది ఏదీ లేకపోయినా.. ఈ సినిమాలు చూపించిన ఇంపాక్ట్ అదిరిపోయింది అని చెప్పాలి. తొలి సినిమా ఓటీటీలో రాగా, ఆ విజయం చూసి రెండో సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు ఇచ్చిన విజయం కారణంగా మూడో సినిమా కోసం టీమ్ రెడీ అయిపోతోంది. ఈసారి ‘పొలిమేర’ పవర్‌ని మరింత పెంచేలా స్టార్ నటులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతతో రాణిస్తున్న సత్యం రాజేష్‌ను హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమాలు తీశారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఇప్పుడు మరోసారి అదే కాన్సెప్ట్‌లో మూడో ‘మా ఊరి పొలిమేర’కు రెడీ అయ్యారు. ఈసారి సీనియర్ నటుడు, యాక్షన్ సినిమా స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జాను ఈ సినిమాలోకి తీసుకుంటున్నారట. మామూలుగా అయితే అర్జున్ సినిమాలకు మన దగ్గర ఆదరణ ఉంది. ఇప్పుడు థ్రిల్లర్ కథతో వస్తున్నారు అనడంతో ఆసక్తి ఇంకా పెరిగిపోయింది.
ఓ గ్రామంలో జరిగే వివిధ ఘటనలు, వాటి వెనుక వ్యక్తులు, పరిస్థితుల ఆధారంగా ‘మా ఊరి పొలిమేర’ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు అర్జున్ లాంటి నటుడిని తీసుకుంటున్నారు అంటే అయితే విలన్ అవ్వాలి, లేదంటే ఊరిని రక్షించే వ్యక్తి పాత్ర అయినా అయి ఉండాలి. మరి అనిల్ విశ్వనాథ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలియాల్సి ఉంది. ‘పొలిమేర 2’ సినిమా వచ్చి సుమారు మూడేళ్లు అవుతోంది. ఇప్పటివరకు మూడో భాగం మొదలుపెట్టలేదు. ఇప్పుడైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి.