రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” (Game Changer) సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సిద్ధమైంది. జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ భారీ అంచనాలు పెంచింది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్, టీజర్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి కలిగించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉండగా, డిసెంబర్ 21న అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్ర కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు మధురై ఎంపీ ఎస్. వెంకటేషన్ “గేమ్ ఛేంజర్” చిత్రానికి కథా రచయితగా తనదైన సహకారం అందించినట్లు సమాచారం. అసలు కథ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) అందించినప్పటికి కొన్ని పాత్రలకు సంబంధించిన వర్క్ కోసం ఆ పొలిటికల్ లీడర్ ఐడియాను ఫాలో అవుతున్నట్లు టాక్.
పొలిటకల్ లీడర్‌గా మాత్రమే కాకుండా, రచయితగా కూడా గుర్తింపు పొందిన వెంకటేషన్ “వీర యుగ నాయగన్,” “కావల్ కొట్టం” వంటి నవలలతో పేరు సంపాదించారు. ఈ నేపథ్యంతోనే, శంకర్ ఆయన సహాయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. చరణ్ ఈ చిత్రంలో ఒక ఐఏఎస్ అధికారిగా కనిపించనుండగా, ఆ పాత్రను మరింత బలంగా రూపుదిద్దించడంలో వెంకటేషన్ కీలక పాత్ర పోషించినట్లు టాక్. సినిమాకు అవసరమైన రాజకీయ పరమైన అంతర్దృష్టిని అందించడంలో వెంకటేషన్ తన శక్తిని వినియోగించినట్లు చెబుతున్నారు.
సెట్స్‌కు తరచూ వచ్చి, స్క్రిప్ట్‌లో సవరణలు సూచనలు చేసినట్లు సమాచారం. చరణ్ పాత్రను ప్రామాణికంగా మార్చడంలో ఆయన సూచనలు పెద్ద పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. “గేమ్ ఛేంజర్” స్క్రిప్ట్‌లో రాజకీయ, సామాజిక అంశాలను ప్రధానంగా చూపించబోతున్నట్లు సమాచారం. వెంకటేషన్ వంటి రాజకీయ నాయకుడు అందించిన ఇన్‌పుట్స్ ఈ కథను మరింత బలంగా మార్చాయనే టాక్ వస్తోంది. చరణ్ ఐఏఎస్ పాత్ర సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.