పిల్ల-పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఆనందంగా జరుపుకొనే అతికొద్ది పండుగల్లో దీపావళి ఒకటి. ఆ దీపావళి వేడుకను కొందరు దీపాల వెలుగులో జరుపుకొంటే.. ఇంకొందరు పటాసులు పేల్చుకొంటూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. తొలుత ఈ సంబరాలు సాధారణంగానే సాగినా.. స్టేటస్ అనే మధ్యలో రావడంతో ఎవరు ఎక్కువ పటాసులు పేల్చితే వారే ఘనంగా దీపావళిని నిర్వహించుకొన్నట్లు అనే లెక్కలు వచ్చి ఒకర్ని మించి ఒకరు టపాసులు కాలుస్తూ వారి స్తోమతను బహిరంగంగా, ఆర్భాటంగా రివీల్ చేసుకొంటున్నారు. దాంతో.. వెలుగుల పండగ కాస్తా కాలుష్యపు పర్వదినమైపోయింది. గత కొన్నేళ్లుగా తక్కువ మోతాదులో టపాసులు కాల్చండి అంటూ మేధావులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఎంతగానో చెబుతున్నప్పటికీ ఎవరూ వినకపోవడంతో.. ఈసారి సుప్రీం కోర్ట్ రంగంలోకి దిగి పటాసులు పేల్చకండి అంటూ నోటీసులు జారీ చేసింది.
ఈ సుప్రీం కోర్ట్ నిర్ణయంపై డీజే బ్యూటీ పూజా హెగ్డే స్పందిస్తూ.. “నేను చాలా మారుమూల గ్రామంలో పెరిగాను, అక్కడి నదుల్లో ఆడుకుంటూ.. చుట్టూ ఉన్న కొండలు, గుట్టలు ఎక్కుతూ నా బాల్యాన్ని గడిపాను. అందువల్ల ముందు నుంచీ నాకు పర్యావరణం పట్ల ప్రేమ ఎక్కువ. అందుకే ఎనిమిదేళ్ళ తర్వాత ఎప్పుడూ పటాసులు పేల్చలేదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. త్వరలోనే ఈ తీర్పును అన్నీ చోట్లా అమలు చేస్తారని ఆశిస్తున్నాను అని తెలిపింది.