సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ తీసుకోని హీరోలు ఉన్నారు, కొంత రెమ్యనరేషన్ మాత్రమే తీసుకునే హీరోలు ఉన్నారు. తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత వెనక్కి ఇచ్చే వాళ్లు ఉన్నారు. నిర్మాత ఎలా పోతే మనకేంటి అని వదిలేసే వారు కూడా ఉన్నారు. అదే నిర్మాతకు ఇంకో సినిమా చేస్తాను అని మాటిచ్చి చేసిచ్చేవాళ్లూ ఉన్నారు మన టాలీవుడ్‌లో. ఇప్పుడు ఆఖరి రకం మాటిచ్చాడట ప్రభాస్. ఇటీవల భారీ అంచనాలతో వచ్చి బేర్ మనిపించింది ‘ప్రభాస్ రాజా సాబ్’. ఆ సినిమా ఫలితం కారణంగా ఏర్పడ్డ బాకీ, గత సినిమాల బాకీని తీర్చేసే ప్రయత్నం చేశారట.
‘రాజాసాబ్’ సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద ఆశలు పెట్టుకొంది. పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా కాన్సెప్ట్‌లో తీశాం కదా.. ఈ సినిమా ఎలాగైనా తమ సంస్థని గట్టెక్కిస్తుందని నమ్మింది. ఎందుకంటే అప్పటికే పీపుల్ మీడియా నష్టాల్ని చవి చూస్తోంది. ‘మిరాయ్’ లాంటి సినిమా కాస్త ఇబ్బందులు తగ్గించినా.. ‘రాజాసాబ్’ మొత్తం సమస్యల్ని తీర్చేస్తుంది అనుకున్నారు. ఈ క్రమంలో ‘ఆదిపురుష్’ సినిమా ఇచ్చిన నష్టాలు కూడా కవర్ చేసుకుందాం అనుకున్నారు. అయితే అవేవీ వర్కవుట్ కాలేదు. దీంతో నిర్మాతకు నష్టం తగ్గించే ప్రయత్నంలో మరో సినిమా చేయడానికి ప్రభాస్ ముందుకొచ్చారట.
అయితే ఆ సినిమా ఇప్పటికిప్పుడు కుదరకపోవొచ్చు కానీ.. 2027 లేదా 2028లో ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. ఈలోగా ప్రభాస్ ఇమేజ్‌కి సరిపడే కథ, దర్శకుడిని రెడీ చేసుకునే పెద్ద పని నిర్మాత విశ్వప్రసాద్ మీద పడింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో హారర్ కామెడీ చేయడం ఏంటీ అనే విమర్శలు ‘రాజాసాబ్’ సమయంలో వినిపించాయి. కానీ వైవిధ్యం అంటూ ముందుకెళ్లారు. అదే ఇప్పుడు సినిమాకు, పీపుల్ మీడియాకు ఇబ్బంది పెట్టింది. మరిప్పడు ఎలాంటి కథను, ఏ దర్శకుడిని రెడీ చేస్తారో చూడాలి. ఆయన దగ్గరైతే కథలు, దర్శకులు ఎప్పుడూ రెడీ అవుతూ ఉంటారు.