రజనీకాంత్ – కమల్ హాసన్ కలసి నటిస్తే చూడాలని సినిమా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అభిమానిని అతీతంగా ఆ సినిమా కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో 46 ఏళ్ల క్రితం ఇద్దరినీ అలా ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం కలిగింది. ఆ తర్వాత చాలామంది ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. దీంతో ఎవరు ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడినా ఆసక్తి రేగుతోంది. మొన్నీమధ్య ‘కూలీ’ సినిమా వచ్చినప్పుడు కూడా కమల్ – రజనీ ప్రాజెక్ట్ మీద చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.
అందులో ఓ దర్శకుడు అయితే తాను ఆ సినిమా చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. అతడే ప్రదీప్ రంగనాథన్. దర్శకుడు కెరీర్ ప్రారంభించిన ప్రదీప్.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఇప్పుడు రెండు సినిమాలను రెడీ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు కమల్ – రజనీ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా తీసే అవకాశం వచ్చిందో, లేదో కూడా నేను చెప్పను. కానీ, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదు అని మాత్రం చెప్పాడు ప్రదీప్. దర్శకత్వం మీద కంటే యాక్టింగ్ మీదే ఫోకస్ పెట్టాలనుకోవడమే కారణం అని చెప్పాడు.
కమల్ – రజనీకాంత్ మల్టీస్టారర్ గురించి ఇంతకంటే ఏం చెప్పలేను. నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని. ఇప్పటివరకూ విడుదలైన ఆయన సినిమాలు మొదటి రోజు మొదటి ఆట చూశాను. ‘డ్రాగన్’ విడుదలయ్యాక ఆయన నన్ను ప్రశంసించారు. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రదీప్ తెలిపారు. ఇటీవల సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ ఈ మల్టీస్టారర్ గురించి చెప్పాడు. ఇద్దరం కలసి నటిస్తామని తెలిపాడు.
ఇక ఈ విషయంలో క్లారిటీ రావాల్సింది ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నుండే. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ కంటే ఎక్కువగా లోకేశ్ పేరే వినిపించింది. మరి ఆయన ఏమంటారో చూడాలి. ఏమాటకామాట రజనీ, కమల్ లాంటి ఇద్దరు అగ్రహీరోలను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు.