2014లో విడుదలైన “ప్రతినిధి” (Prathinidhi) ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఓ సామాన్యుడు ఏం చేశాడు అనే నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం కమర్షియల్ గానూ మంచి హిట్ కొట్టి కాన్సెప్ట్ సినిమా పవర్ ను చూపించింది. సరిగ్గా పదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం “ప్రతినిధి 2” (Prathinidhi 2) . నారా రోహిత్ (Nara Rohit) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి టీవీ5 మూర్తిగా సుపరిచితుడైన మూర్తి (Murthy Devagupthapu) దర్శకుడు. మరి ఎన్నికల వేళ విడుదలైన ఈ సీక్వెల్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆలోచింపజేసింది? ఎంతవరకూ అలరించింది? అనేది తెలుసుకొందాం!
కథ: బెదిరింపులు, దాడులకు తలొగ్గని ధైర్యవంతుడైన పాత్రికేయుడు చేతన్ (నారా రోహిత్). ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ అక్రమార్కుల పనిపడుతున్న చేతన్ పనితనం మెచ్చి ఎన్.ఎన్.సి ఛానల్ సీఈఓగా నియమించుకొంటుంది సదరు సంస్థ. ఆ ఛానల్ ద్వారా ఎందరో రాజకీయ అక్రమార్కుల అవినీతి భాగోతాలను ప్రజల ముందు ఉంచుతాడు చేతన్.
అదే తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించడంతో.. ఆయన కుమారుడు (దినేష్ తేజ్) ఆ పదవి దక్కించుకొనే ప్రయత్నానికి చేతన్ అడ్డంకిగా నిలుస్తాడు. అసలు ముఖ్యమంత్రి మరణానికి కారణం ఏమిటి? దాన్ని కొందరు రాజకీయనాయకులు తమ బెనిఫిట్ కోసం ఎలా వాడుకున్నారు? జనాలు ఈ రాజకీయ చట్రంలో ఇరుక్కుని ఎలా మోసపోతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ప్రతినిధి 2” చిత్రం.
నటీనటుల పనితీరు: ఈ తరహా ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు పోషించడంలో నారా రోహిత్ దిట్ట. చేతన్ అనే పాత్రలో అతడు నిజాయితీ గల జర్నలిస్టుగా చాలా సెటిల్డ్ గా నటించడమే కాక.. చక్కని డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నిజానికి నారా రోహిత్ తెరపై కనిపించి చాలా రోజులవుతుంది. కానీ.. అలా గ్యాప్ వచ్చిందని ఎక్కడా కనబడనివ్వలేదు రోహిత్. సరైన పాత్ర దొరికితే తన నటచాతుర్యం చూపగలనని చెప్పకనే చెప్పాడు.
సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో అజయ్ మరోసారి తన సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నాడు. దినేష్ తేజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ.. చాలా సన్నివేశాల్లో ఓవర్ గా రియాక్ట్ అయ్యి పాత్రను ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు.
జీషుసీన్ గుప్తా, అజయ్ ఘోష్ (Ajay Ghosh) లు కథా గమనంలో తమ నటనతో కీలకపాత్ర పోషించారు. సిరి లెల్ల హీరోయిన్ అనే విషయం అర్థమవ్వడానికి చాలా సమయం పట్టింది, ఆమె హావభావాల ప్రదర్శనలో క్లారిటీ లేక ఆమె పాత్రలో ఇంటెన్సిటీ కూడా పండలేదు. పృథ్వీరాజ్, ఉదయభాను (Udaya Bhanu) పాత్రలు ఆకట్టుకున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు: నాని చమిడిశెట్టి (Nani Chamidishetty) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. చాలా మిమిమం బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. ముఖ్యంగా నారా రోహిత్ కి పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ & క్లైమాక్స్ లో పెట్టిన బెస్ట్ సైజ్ షాట్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మహతి స్వరసాగర్ (Mahati Sagar) నేపథ్య సంగీతం అక్కడక్కడా ఎక్కడో విన్న అనుభూతి కలిగించినా.. ఓవరాల్ గా మాత్రం ఆకట్టుకుంది.
ప్రొడక్షన్ డిజైన్ చాలా టైట్ బడ్జెట్ లో చేసినట్లుగా తెలిసిపోతుంది. ఫైట్ సీన్స్ & బ్లాస్టింగ్ సీన్స్ లో అవుట్ పుట్ అందుకు నిదర్శనంగా నిలుస్తుంది.
దర్శకుడు మూర్తి దేవగుప్తపు ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా.. ఒక సగటు కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ రిలీఫ్. లేకపోతే ఈ ఎలక్షన్స్ సమయంలో ఈ సినిమా విడుదలయ్యేదే కాదు. అలాగే.. రాజకీయాలను ఒక జర్నలిస్ట్ పాయింటాఫ్ వ్యూలో తెరకెక్కించిన విధానం, ఎలక్షన్స్ & నాయకులు ఎంపికవ్వడంలో జర్నలిస్టులు పోషించే కీలకపాత్రను తెరకెక్కించిన తీరు బాగుంది. చెప్పాలంటే.. ఈమధ్యకాలంలో డెబ్యూ ఇచ్చిన చాలా మంది డైరెక్టర్స్ కంటే మూర్తి బెటర్ అవుట్ పుట్ తోనే వచ్చాడు. అయితే.. సెకండాఫ్ లో నాటకీయత కాస్త శృతి మించింది. క్యాంప్ ఆఫీస్ లో జరిగే సన్నివేశాలను చూపించిన విధానంలో లాజిక్స్ మిస్ అయ్యాయి. అయితే.. కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆ లాజిక్స్ ను కవర్ చేశాడు మూర్తి.
విశ్లేషణ: “ప్రతినిధి” స్థాయిలో కాకపోయినా.. “ప్రతినిధి 2” కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకొనే చిత్రమే. ప్రతి పౌరుడు ఓటు వేయాలని, ఆ ఓటు వేయకపోతే జరిగే నష్టాలను వివరించిన విధానం బాగుంది. నారా రోహిత్ ఇంటెన్స్ యాక్టింగ్, మూర్తి టేకింగ్ & డైలాగ్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ & లాజిక్స్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే సూపర్ హిట్ గా నిలిచేదీ చిత్రం.
ఫోకస్ పాయింట్: ప్రతినిధి ప్రశ్నించిన విధానం బాగుంది, సమాధానం చెప్పిన తీరు ఆకట్టుకోలేకపోయింది.
రేటింగ్: 2.5/5