కొన్ని సినిమాలు కొంతమందే తీయగలరు అని అంటారు. అంటే మిగిలిన వాళ్లు చేయలేరు అని కాదు కానీ.. ఆ సినిమాలకు ఆయన అయితే బెటర్ అనే మాట వినిపిస్తుంటుంది. అలా మనసుల్ని మెలి తిప్పేసే సినిమాలు ఇప్పటితరంలో తీయాలి అంటే సరైన దర్శకుల్లో ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) ఒకరు. ఇలా పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. ‘96’ ప్రేమ్ కుమార్ అంటే సులభంగా తెలుసుకోగలుగుతారు. ఆయనేనండి రీసెంట్‌గా ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) అనే సినిమా చేశారే ఆయనే.
ఎమోషన్స్‌తో సినిమాలు తీయడం, వాటిని అంతకుమించి అనేలా పండించడం ఆయనకు అలవాటు. తొలుత ‘96’ ప్రేమకథను హృద్యంగా చూపిస్తే, ఇప్పుడు బావాబామ్మర్దుల బంధాన్ని ‘సత్యం సుందరం’ అంటూ అంతే బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు థియేటర్‌లో మంచి స్పందన వచ్చినా ఆశించినంత వసూళ్లు రాలేదు అని చెబుతారు. అయితే ఓటీటీలోకి సినిమా వచ్చాక చాలామంది రిపీటెడ్‌గా చూసేస్తున్నారు. అలా చూసిన ఓ వ్యక్తి చేసిన పని గురించి దర్శకుడు చెప్పుకొచ్చారు.
సినిమా ఓటీటీలోకి వచ్చాక చూసిన ఓ వ్యక్తి ఇంత మంచి సినిమా మిస్ అయినందుకు బాధ పడుతున్నామని, గూగుల్ పేలో డబ్బులు వేసి నిర్మాతకు పంపమని అడిగారట. దీంతో ప్రేమ్ కుమార్ షాక్ అయ్యారట. అదేదో థియేటర్లలోనే సినిమా చూసి ఉంటే కమర్షియల్‌గా ఇంకాస్త పెద్ద విజయం అందుకునేది కదా అని ప్రేమ్ కుమార్ చెప్పిన మాటలు విన్నాక జనాలు అనుకుంటున్నారు. అయినా ఇప్పుడేం లాభం అంతా అయిపోయాక అనే వాళ్లూ ఉన్నారు.
ఇక మరో విషయం ఏంటంటే.. ‘96’ సినిమాకు సీక్వెల్ ప్రయత్నాల్లో ప్రేమ్ కుమార్ ఉన్నారు. కథ దాదాపు పూర్తియిపోవచ్చిందట. అయితే అందులో నటించేది ఎవరు అనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు అని ఆయన చెప్పారు. ‘జాను’ (Jaanu) అంటూ ‘96’ని తెలుగులోకి తీసుకొస్తే బొక్క బోర్లాపడింది సినిమా. కాబట్టి సీక్వెల్ మాత్రం డబ్బింగ్ రూపంలోనే మన దగ్గరకు వస్తుంది అని చెప్పొచ్చు.