తెలంగాణ ప్రభుత్వం – టాలీవుడ్ మధ్య గురువారం జరిగిన మీటింగ్‌పై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) స్పందించారు. నిజానికి ఆయన స్పందించారు అనే కంటే.. ఆగ్రహం వ్యక్తం చేశారు అనే చెప్పాలి. ఒక మనిషి కోసం ఇండస్ట్రీ మొత్తం వెళ్లి తెలంగాణ ప్రభుత్వం ముందు తలవంచుకోవాలా అని ఘాటుగా ప్రశ్నించారు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీ మొత్తం వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలవంచుకుని నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది.
ఒక మనిషి కోసం ఇంత చేయాలా? ఆ మనిషి కావాలని చేశాడా? లేక అనుకోకుండా జరిగిందా అనేది నేను అడగడం లేదు. ఏం చేసినా, ఏం జరిగినా తప్పైతే జరిగింది. అలా అని తప్పంతా ఆయనే అని నేను అనడం లేదు. థియేటర్ దగ్గర రోడ్ షోలా చేయడం కానీ సరికాదు. వీటి వల్ల తెలియకుండానే ఆయన బాధ్యుడు అయ్యాడు. ఇదంతా ఆయన ప్రేరేపితుడు అయి చేశాడా? లేక సొంతంగానే చేశారా అనేది నాకు తెలియదు. ఏదైనా కానీ తప్పు తప్పే.
ఈ తప్పు జరిగిన తర్వాత దానిని కవర్ చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్పారు. దీంతో ప్రభుత్వం ప్రెస్టీజ్‌కి తీసుకుంది. రెండువైపులా వాళ్ల వాదనలు వినిపిస్తున్నారు. దీని వల్ల మొత్తం ఇండస్ట్రీ పెద్దలు అందరూ ప్రభుత్వం ముందు నిలబడాల్సి వచ్చింది. .ఇలా ఒక్క మనిషి కోసం మొత్తం ఇండస్ట్రీ ఇలా తలవంచుకోవడాన్ని కాంప్రమైజ్ అనాలా లేక తలవంపులు అనాలో అర్థం కావడం లేదు.
ఒక్క మనిషి కోసం, ఆ మనిషి ఈగో కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని తమ్మారెడ్డి (Tammareddy Bharadwaj) అన్నారు. అయితే ఈ వైరల్ వీడియోలో ఆయన ఆ వ్యక్తి ఎవరు అనేది ఎక్కడా చెప్పలేదు. అయితే అది ఎవరి గురించి అనేది టాలీవుడ్‌లో రీసెంట్ పరిణామాలు పరిశీలిస్తున్న అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇండస్ట్రీ నుండి ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.