‘వారణాసి’ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఆ సినిమా భారీతనం గురించి చెబుతున్నారు. రాజమౌళితో పని చేయడానికి తాము ఇన్నాళ్లూ వెయిట్ చేశామని చెబుతున్నారు. కానీ ఒక్కరు మాత్రం తాను ఆ సినిమా ఓకే చేయడానికి వేరే కారణం చెబుతున్నారు. ఆమెనే ప్రియాంక చోప్రా. బాలీవుడ్ కథానాయికగా కెరీర్ ప్రారంభించి ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలో ‘వారణాసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
ప్రియాంక చోప్రా ఐదేళ్ల తర్వాత ఇండియన్ సినిమాలో నటిస్తోంది అనేసరికి ఏంటా సినిమా అంటూ ‘వారణాసి’ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఈ సినిమాను అంగీకరించడానికి ముందు మీరేం ఆలోచించారు అని ప్రియాంక చోప్రాను ఇటీవల విడుదలైన ఓ ఇంటర్వ్యూలో వీడియలో అడిగితే.. ‘డ్యాన్స్’ అని చెప్పింది. సినిమా గురించి రాజమౌళి చెప్పినప్పుడు ‘ఈ సినిమాలో నాకు డ్యాన్స్ ఉందా?’ అని అడిగిందట ప్రియాంక.
తాను డ్యాన్స్ చేసి చాలా ఏళ్లయిందని, మంచి డ్యాన్స్ పాట పడితే ఆడదాం అని అనుకున్నానని అదే రాజమౌళికి చెప్పానని ప్రియాంక చెప్పింది. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఆమెకు బాగా డ్యాన్స్ చేసే అవకాశం రాజమౌళి కల్పించారని ఇంటర్వ్యూలో పక్కనే ఉన్న మహేష్‌బాబు చెప్పారు. ఇద్దరం కలసి ఓ పాటలో డ్యాన్స్ చేశామని, ఇటీవల ఆ సినిమా షూటింగ్ చేశారని కూడా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ గతేడాది నవంబరులో రికార్డు చేశారు. అంటే దానికి ముందే పాట చిత్రీకరించారన్నమాట.
ఇక ఈ సినిమాను వచ్చ ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. అయితే మరిప్పుడు ఎందుకు సినిమా ప్రచారం షురూ చేశారు అనేది తెలియడం లేదు. ఇంకా విడుదలకు 14 నెలలు ఉండగా ప్రచారం అంటే రైట్స్ లెక్క తేల్చడానికే అంటున్నారు. ముందుగా డీల్స్ చేసుకొని తర్వాత సినిమా పనులు చూద్దామని టీమ్ అనుకుంటోందట.