సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నంతవరకు బాగానే ఉంటుంది కానీ.. ఒక్కసారి పొరపాటున ఆ రంగం నుంచి డైవర్ట్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారంటే మాత్రం అప్పటివరకూ వాళ్ళు వేసుకున్న తెల్ల చొక్కా కూడా ఆటోమేటిక్ గా నల్లగా మారిపోతుంది. నిన్నమొన్నటివరకూ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన మోహన్ బాబు రాజకీయాల్లోకి ఎంటరవ్వగానే.. పోలీస్ కేసు, కోర్ట్ తీర్పులతో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో నిర్మాత పి.వి.పి పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఆయన సినిమా రంగంలో ప్రొడ్యూసర్ గా కొనసాగుతూనే.. వై.ఎస్.ఆర్.సి.పి తరుపున విజయవాడ నుంచి ఎన్నికల్లో నిల్చున్నారు.
దాంతో ఆయన మీద ఎలిగేషన్స్ మొదలయ్యాయి. ఆయన ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నంతవరకూ ఆయన మీద ఒక్కటంటే ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన శ్రుతిహాసన్ ను డబ్బు విషయంలో బ్లాక్ మెయిల్ చేశాడని వార్తలు రావడం మొదలయ్యాయి. దాంతో ఆ రూమర్స్ క్లియర్ చేయడం కోసం పి.వి.పి రంగంలోకి దిగక తప్పలేదు. శ్రుతి హాసన్ “ఊపిరి” షూటింగ్ నుంచి ఉన్నట్లుండి తప్పుకోవడంతో ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్ ను వెనక్కి తీసుకున్నామే తప్ప ఆమెపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, ఇప్పటికీ ఆమెతో నాకు మంచి రిలేషన్ ఉందని చెప్పుకొచ్చారు పి.వి.పి. ఆయన ఈ ఎలక్షన్స్ ముగిసేలోపు ఇలాంటివి ఇంకెన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో.