కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే పునీత్ కు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పునీత్ చివరి సినిమా జేమ్స్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. 4,000 థియేటర్లలో ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. పునీత్ ఫ్యాన్స్, సన్నిహితులు అతనిని ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. పునీత్ హఠాన్మరణం వల్ల కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కర్ణాటక రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా మినహా మరే సినిమాను రాష్ట్రంలోని థియేటర్లలో వారం రోజుల పాటు ప్రదర్శించకూడదని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4,000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని బోగట్టా. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరిగాయని తెలుస్తోంది.
జేమ్స్ సినిమాలో సైన్యాధికారిగా, మేనేజర్ గా పునీత్ రాజ్ కుమార్ రెండు పాత్రలలో కనిపించనున్నారు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. పునీత్ ఈ సినిమాలో సొంతంగా ఫైట్లు కంపోజ్ చేసుకున్నారని తెలుస్తోంది. పునీత్ చివరి సినిమా కాబట్టి బెంగళూరులోని ఒక థియేటర్ దగ్గర ఏకంగా 81 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
చరణ్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జేమ్స్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ వ్యక్తి అయిన కిషోర్ పత్తికొండ నిర్మాత కావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.