‘చి.ల.సౌ’ అంటూ తొలి అడుగులోనే దర్శకుడిగా తనెంత స్పెషల్ అనే విషయాన్ని నిరూపించుకున్నారు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అయితే రెండో సినిమా ‘మన్మథుడు 2’తో దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కథ ఎంపిక, చూపించిన విధానం ఇలా అన్నీ ఇబ్బందిపెట్టాయి. ఇప్పుడు మూడో ప్రయత్నంగా చాలా రోజుల క్రితమే ‘గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమాను చేశాడు. అయితే ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు నవంబర్ 7 డేట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ఆయన దర్శకుడితోపాటు నటుడు కూడా. అలా అవ్వడానికి వెనుకున్న కారణం కూడా చెప్పుకొచ్చారాయన.
రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం రాహుల్ రవీంద్రన్ టాలీవుడ్‌లో కొంతమంది నటుల్ని సంప్రదించారట. అలాగే ఓ స్టార్ దర్శకుడిని కూడా కాంటాక్ట్ అయ్యారట. అలా ఎవరూ ఓకే అనకపోవడంతో ఇక వేరే అవకాశం లేక అతనే ముందుకొచ్చి ఆ పాత్రలో నటించారట. ఈ క్రమంలో తను చాలా ఏళ్లుగా పెట్టుకున్న ఓ నియమాన్ని కూడా ఉల్లంఘించారట. పాత్ర చిన్నదే అయినా.. సినిమా గమనంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు రాహుల్ రవీంద్రన్.
‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు అంతా ఓకే అనుకుని ముందుకెళ్తున్నప్పుడు ఓ పాత్ర దగ్గర ఆగిపోయారట. ఆని కోసం ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను సంప్రదించారట. కాస్త లెంగ్తీ ఉన్న పాత్ర కావడంతో ఓసారి ఆయనను అడిగారట. ‘‘కాసేపంటే ఫర్వాలేదు కానీ.. నాలుగైదు సీన్లంటే కష్టమే” అని సందీప్ నో చెప్పేశారట. ఆ తర్వాత ఆ పాత్ర గురించి వెన్నెల కిషోర్‌కి చెబితే.. ఆయన కూడా నో చెప్పారట. అంత సీరియస్ పాత్ర తనకు నప్పదేమో అని అనుకున్నారట కిషోర్. దీంతో రాహుల్ నటించేశారట.
అయితే నటన – దర్శకత్వం రెండూ చేయడం తన వల్ల కాదని, ఎందుకంటే తాను మల్టీటాస్కర్ కాకపోవడమే అని చెప్పారు రాహుల్. అందుకే దర్శకత్వం వహించే సినిమాల్లో నటించడకూడదు అని ఫిక్స్ అయ్యారట. అందుకే గత రెండు సినిమాల్లోనూ నటించలేదు అని చెప్పారు రాహుల్.