నాన్నగారు ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను – రాహుల్ విజయ్

ఫైట్ మాస్టర్ కొడుకు కదా ఫైట్స్ మాత్రమే చేస్తాడేమో అనుకొన్నారందరూ. కానీ.. ట్రైలర్ లోని డ్యాన్స్ మూమెంట్స్ తో తన సత్తాను ఘనంగా చాటుకొన్నాడు రాహుల్ విజయ్. అతను కథానాయకుడిగా నటించిన “ఈ మాయ పేరేమిటో” ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో తన సినిమాటిక్ జర్నీ గురించి, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు..!!

అమ్మాయి వల్ల జర్నీ మారుతుంది..
సరదాగా, గోల్ అనేది లేకుండా తిరిగే కుర్రాడు ఒకమ్మాయి కోసం మారతాడు. అప్పటివరకూ జులాయిగా తిరిగిన ఆ కుర్రోడు అమ్మాయి కోసం బాధ్యతగా ప్రవర్తించడం మొదలెడతాడు. ఆ ప్రవర్తన పుణ్యమా అని హీరోకి లాభం ఉండదు కానీ.. హీరో ఫ్యామిలీ మాత్రం సంతోషపడతారు. అలా మొదలైన ఆ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరింది అనేది ఈ సినిమా కథాంశం.

ఎనిమిదేళ్ళ శ్రమ..
నేను స్కూల్లో చదువుతున్నప్పుడే నాన్న నాకు సినిమాల మీద ఆసక్తి ఉందని గ్రహించి నన్ను సినిమాలవైపు నడిపించారు. అందుకే ఇంటర్, డిగ్రీ చదువుతున్నప్పట్నుంచే మార్షల్ ఆర్ట్స్, కరాటే, డ్యాన్స్, యాక్షన్ లాంటివి నేర్చుకున్నాను. దాదాపు ఎనిమిదేళ్లు కష్టపడిన తర్వాత నన్ను నేను ఎట్టకేలకు “ఈ మాయ పేరేమిటో” సినిమాలో చూసుకోగలిగాను.

సుకుమార్ ప్రొడ్యూస్ చేయాలి కానీ..
నిజానికి ఈ చిత్రాన్ని సుకుమార్ గారు నిర్మించాలి. ఈ సినిమా స్క్రిప్ట్ మొదలుకొని ప్రీప్రొడక్షన్ వరకూ అన్నీ ఆయనే చూసుకొన్నారు. కానీ.. ఆయన “రంగస్థలం” మేకింగ్ లో బిజీ అయిపోవడంతో సినిమా రూపాంతరం చెందడానికి చాలా సమయం పడుతూ వచ్చింది. దాంతో నాన్న-అక్క కలిసి ఈ ప్రొజెక్ట్ ను డీల్ చేయడం మొదలెట్టారు. కానీ.. ఇప్పటికీ సుకుమార్ గారు మాకు తోడుగానే ఉన్నారు.

అలాంటి సినిమాలు చేయడానికి చాలామంది హీరోలున్నారు..
నాకున్న స్కిల్స్ కి ఏదైనా మాస్ సినిమా చేసి ఉండొచ్చుగా అని చాలామంది అడుగుతున్నారు. కానీ.. అలా మాస్ సినిమాలు చేయడానికి చాలామంది హీరోలున్నారు. నా ఏజ్ కి ఇప్పుడు లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుంది. తర్వాత మళ్ళీ చేయలేను అని కాదు కానీ ఇప్పుడు చేయడం కరెక్ట్ అనిపించింది. తర్వాత మెలమెల్లగా మాస్ మూవీస్, డిఫరెంట్ సినిమాలు, ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేస్తాను.

నాన్న అన్న ఆ మాటను జీవితాంతం గుర్తుంచుకొంటాను..
ఎనిమిదేళ్ళ కష్టం అనంతరం నన్ను నేను ఫ్రేమ్ లో చూసుకొన్నప్పుడు వచ్చిన ఆనందాన్ని ఎలా అయితే మాటల్లో చెప్పలేనో… అదే విధంగా సినిమా చూసిన తర్వాత మా నాన్న నా దగ్గరకి వచ్చి “ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది నాకు తెలియదు కానీ.. హీరోగా మాత్రం నువ్ సక్సెస్ అయిపోయావురా” అని చెప్పారు. ఇది నా బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన కాంప్లిమెంట్ నాలోని కాన్ఫిడెన్స్ లెవల్స్ ను పెంచింది.

ఇంటర్వ్యూస్ కి మాత్రం నేను ఆకాష్ ప్రిపేర్ అవ్వలేదు..
నేను, పూరీ జగన్నాధ్ గారి అబ్బాయి ఆకాష్ చిన్నప్పుడు ఆడియో ఫంక్షన్స్ లో ఎలా ఉండాలి అనేది ప్రాక్టీస్ చేసిన, ఆలోచించిన సందర్భాలున్నాయి కానీ.. మీడియా ఇంటర్వ్యూస్ లో ఎలా మాట్లాడాలి అని మాత్రం ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు.

నాన్నగారిని చూస్తే బాధేస్తుంది..
నాన్నగారు ఎప్పుడైనా తను వర్క్ చేసిన సినిమా సెట్స్ లో వర్క్ సరిగా జరగకపోతే ఆయనకి రాత్రి నిద్ర పట్టేది కాదు. నా సినిమా చేస్తున్నన్ని రోజులు కూడా ఆయన ఏ రోజూ ప్రశాంతంగా పడుకోలేదు. ఆయన కళ్ళు చూస్తే ఎర్రగా ఉంటాయి, బాధేస్తుంటుంది నాకు. సినిమా రిలీజయ్యాక ఆయన కళ్ళలో ఆనందాన్ని చూస్తానన్న నమ్మకం మాత్రం ఉంది. అలాగే.. మా అక్క కూడా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేకుండా ప్రొడక్షన్ లోకి నాకోసం దిగింది. తను కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యింది.

ప్రేమను వ్యక్తపరచడంలో ముద్దు కూడా భాగం..
మా మూవీ ట్రైలర్ చివర్లో ఉన్న ముద్దు సీన్ చూసి అందరూ ఇది కూడా అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమా అనుకొంటున్నారు. కానీ.. నాకు ముద్దులో తప్పేముంది అనేది అర్ధం కావడం లేదు. ఇద్దరు ప్రేమించుకొన్నప్పుడు తమ ప్రేమను శారీరికంగా వ్యక్తపరుచుకుంటారు. కొందరు ముద్దులు, ఇంకొందరు హగ్గులు. అదేదో పెద్ద విషయంలా అనుకొంటున్నాం మనం. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు కూడా సందర్భానుసారంగా, ఎమోషనల్ గా ఉంటాయి తప్పితే ఇరికించినట్లుగా ఉండవు.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus