ఒక బాధ్యత కలిగిన జులాయిగా నటిస్తున్నాను : రాజ్ తరుణ్

స్టార్ స్టేటస్, సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్. తనను తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ తరుణ్ నటిస్తున్న రెండో చిత్రం “రంగుల రాట్నం”. అసలు ఎప్పుడు షూట్ చేశారో కూడా తెలియదు కానీ.. ఉన్నట్లుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. శ్రీరంజని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమయ్యాడు రాజ్ తరుణ్. సినిమా గురించి తన భవిష్యత్ ప్రొజెక్ట్స్ గురించి చెప్పిన వివరాలు మీకోసం..!!

చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకొన్నామ్..
సాధారణంగా సినిమా ప్రారంభం మొదలుకొని ప్రతి షెడ్యూల్ కి సంబంధించిన వివరాలను అందరికీ చెబుతూ పబ్లిసిటీ చేస్తాం. కానీ… “రంగుల రాట్నం” విషయంలో కాస్త సర్ ప్రైజ్ చేద్దామనుకొన్నామ్. అందుకే డైరెక్ట్ గా ట్రైలర్ తో మీముందుకు వచ్చాం. చాలామంది షాక్ అయ్యారు అసలు ఎప్పుడు తీశారు సినిమా అని. అయితే.. ఇంపాక్ట్ మాత్రం బానే ఉంది.

ఎమోషనల్ & సెంటిమెంటల్ లవ్ స్టోరీ..
“రంగుల రాట్నం” ఒక నవతరం ప్రేమకథ. అబ్బాయి మరియు అమ్మాయి దృష్టికోణంలో సాగే కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషన్స్, సెంటిమెంట్స్ సమపాళ్లలో ఉన్న లవ్ స్టోరీ ఇది. ఒక బాధ్యత కలిగిన జులాయికి, పద్ధతికి ప్రాణమిచ్చే అమ్మాయి జత కడితే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరం. యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

సంక్రాంతి రిలీజ్ ప్లస్ పాయింటే,,
సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గార్ల సినిమాలు ఉన్నప్పటికీ మా చిన్న చిత్రాన్ని ధైర్యంగా రిలీజ్ చేయడానికి రీజన్ పండగ సీజన్ కావడమే. నాలుగు పెద్ద సినిమాలు రిలీజైనా ఘన విజయాలు దక్కించుకొనే అవకాశం ఒక్క సంక్రాంతికి మాత్రమే ఉంటుంది. అందుకే ధీమాగా మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నాం.

అసలు ఆ వివక్ష నాకు నచ్చదు..
ఒక డైరెక్టర్ అంటే డైరెక్టరే, అమ్మాయా, అబ్బాయా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది. శ్రీరంజనితో పనిచేసేప్పుడు నాకెప్పుడూ ఆమెను లేడీ డైరెక్టర్ అని పిలవాలి అనిపించలేదు. నా దృష్టిలో ఆమె ఒక డైరెక్టర్ అంతే. నిజానికి ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూని ఆమె అర్ధం చేసుకొని తెరకెక్కించిన విధానం మాత్రం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.

శ్రీచరణ్ ఆశ్చర్యపరుస్తాడు..
నాకు తెలిసినంతరరకూ శ్రీచరణ్ ఒక ఎక్స్ లెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకూ అతనికి ఒకే సినిమాలో 6 పాటలు స్వరపరిచే అవకాశం లభించలేదు. ఈ సినిమాకి నేపధ్య సంగీతంతోనే కాక బాణీలతోనూ ఆకట్టుకొన్నాడు శ్రీచరణ్. అసలు బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఇలా కూడా ఇవ్వొచ్చా అనిపించేలా ఎగ్జయిట్ చేశాడు.

చిత్ర శుక్లా చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్..
మా హీరోయిన్ చిత్ర శుక్ల చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్. సన్నివేశానికి తగ్గట్లు నటించడంలో ఆమె దిట్ట అనే విషయం నాకు మొదటిరోజే అర్ధమైపోయింది. అందంతోపాటు అభినయ సామర్ధ్యం కూడా ఉన్న కథానాయకి ఆమె.

నో విలన్.. ఓన్లీ ఎమోషన్
మన జీవితంలో విలన్ ఎవరు అని అడిగితే ఏం చెప్పగలం. అలాగే “రంగుల రాట్నం”లో కూడా ప్రత్యేకించి విలన్ ఉండడు. ఎమోషన్స్ మాత్రమే. ఆ ఎమోషన్స్ ఎలా క్యారీ అయ్యాయ్ అనేది కథాంశం.

పాట రాశాను కానీ.. అస్సలు పాడను
ఇంతకుముందు “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలో ఒక పాట రాయడం జరిగింది. అలాగే సరదాగా “రంగుల రాట్నం” సినిమా కోసం కూడా ఒక పాట రాశాను. నిజానికి నా లిరిక్స్ ని ఫైనల్ చేశారని రికార్డింగ్ కి వెళ్ళేవారకూ నాకే తెలియదు. పాతలైతే ఏదో సరదాగా రాసేస్తున్నాను కానీ.. పాడటం అనేది మాత్రం జీవితంలో చేయను.

క్యాష్ చేసుకోవాలని క్రియేట్ చేయలేదు..
ఫస్ట్ లుక్ పోస్టర్ లో అమ్మాయి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించుకొన్నట్లు ఉండడంతో అమ్మాయిల్ని కించపరిచామని కొందరు, న్యూఇయర్ జరిగిన ఇష్యూని వాడుకొన్నామని అంటున్నారు కానీ.. అసలు మాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే ఆ ఫోటోషూట్ చేసి నెలరోజులు పైనే అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆ పోస్టర్ లో తాగేసింది అబ్బాయి, సొ అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం అమ్మాయి బైక్ డ్రైవ్ చేసే సన్నివేశమది.

ఈ ఏడాది మూడు సినిమాలు..
ఈ ఏడాది నేను హీరోగా నటించే సినిమాలు మొత్తం మూడు విడుదలవుతాయి. నా నెక్స్ట్ సినిమా “రాజుగాడు” ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఇంకో సినిమా జూన్ లేదా జూలైలో రిలీజ్ ఉంటుంది. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయాలన్నదే నా ధ్యేయం.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus