Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. 2027 ఏప్రిల్ 7న ఈ గ్లోబల్ అడ్వెంచర్ వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ రిలీజ్ డేట్ వెనుక యూఎస్ బాక్సాఫీస్ లెక్కలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు ఒక సానుకూల అంశంతో పాటు ఒక సవాలు కూడా పొంచి ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Mahesh Babu

మొదటగా ప్లస్ పాయింట్ చూస్తే.. ఏప్రిల్ 6, మంగళవారం రోజున యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు పడనున్నాయి. సాధారణంగా అక్కడ మంగళవారం అంటే ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్లు ఉంటాయి. దీనివల్ల టికెట్ సేల్స్ ఊహించని రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి తోడు ఆ సమయానికి స్కూల్స్ కు స్ప్రింగ్ సీజన్ హాలిడేస్ ఉండటం వారణాసికి పెద్ద ప్లస్ కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడానికి ఈ సెలవులు బాగా హెల్ప్ అవుతాయి.

ఇక మైనస్ పాయింట్ విషయానికొస్తే.. మంగళవారం ప్రీమియర్లు వేయడం వల్ల కొన్ని చోట్ల వీక్ డే డిస్కౌంట్లు వర్తించకపోవచ్చు. దీనివల్ల ప్రారంభ వసూళ్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే మిడ్ వీక్ రిలీజ్ కావడం వల్ల వర్కింగ్ క్లాస్ ఆడియన్స్ థియేటర్లకు రావడం కొంచెం కష్టమే. ప్రీమియం స్క్రీన్ల కేటాయింపులో కూడా హాలీవుడ్ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అదే సమయంలో కొన్ని భారీ హాలీవుడ్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. మార్చి 26న విడుదల కాబోతున్న ‘గాడ్జిల్లా x కాంగ్ సూపర్‌నోవా’ అప్పటికే ఐమాక్స్ స్క్రీన్లను ఆక్రమించి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 2న డిస్నీ, యూనివర్సల్ స్టూడియోస్ నుంచి మరో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి.

ఈ చిత్రాల మధ్య వారణాసికి తగినన్ని థియేటర్లు, ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్లు దొరకడం రాజమౌళి టీమ్‌కు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఏదేమైనా రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ముందు ఈ అడ్డంకులు పెద్దవి కావని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. మహేష్ బాబు గ్లోబల్ అప్పీల్, జక్కన్న మేకింగ్ స్టైల్ తోడైతే ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. అంటార్కిటికా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే, యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus