జక్కన్న ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడే. మార్కెటింగ్ మ్యాజిక్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. కానీ ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో ఆయన చేస్తున్న ప్రయోగం వెనుక ఒక చిన్న ప్రమాద ఘంటిక వినిపిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విజయాలతో రాజమౌళి గ్లోబల్ ఐకాన్ అయ్యారు కానీ, గ్రౌండ్ లెవల్ రియాలిటీ వేరేలా ఉంది. ఆయనకు అసలైన బలం, బలగం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులే అనేది కాదనలేని సత్యం.
దీనికి నిదర్శనమే రీసెంట్‌గా నార్త్ అమెరికాలో ‘బాహుబలి’ రీ రిలీజ్ కలెక్షన్స్. తెలుగు వెర్షన్ అక్కడ దాదాపు మిలియన్ డాలర్ల దగ్గరకు వెళితే, తమిళ, మలయాళ వెర్షన్లు కనీసం వందల డాలర్లు కూడా రాబట్టలేకపోయాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే.. సోషల్ మీడియాలో జక్కన్నను పొగిడేవాళ్లు వేరు, థియేటర్లో టికెట్ కొని సినిమాను బతికించేవాళ్లు వేరు. రాజమౌళిని గుండెల్లో పెట్టుకుంది మనమే తప్ప, పక్క రాష్ట్రాల వాళ్లు ఆయన్ను కేవలం ఒక దర్శకుడిగానే చూస్తున్నారు.
ఇప్పుడు ‘వారణాసి’ పేరుతో మహేష్ బాబును ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనే తపనలో, మన నేటివిటీని మిస్ అయితే మొదటికే మోసం వస్తుంది. పుష్ప, కాంతార, కేజీఎఫ్.. ఇవన్నీ లోకల్ కథలే అయినా గ్లోబల్ రేంజ్ వెళ్లాయి. కారణం అందులో ఉన్న మట్టి వాసన, ఆ ఎమోషన్. కానీ జక్కన్న ఇప్పుడు పూర్తిగా హాలీవుడ్ స్టాండర్డ్స్, విజువల్ వండర్స్ అంటూ వెళ్తే, మన వాళ్లకు కనెక్ట్ అయ్యే ఆ ‘సోల్’ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.
పైగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే, ఇది ఊహించదగిన కథే అనే కామెంట్స్ వస్తున్నాయి. అదే నిజమైతే అది రాంగ్ స్టెప్ అయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు తప్ప, ఒకసారి చూసిన ప్రపంచాన్నే మళ్ళీ ఇంకోలా చూపిస్తే పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఏఐ యుగంలో కేవలం గ్రాఫిక్స్ చూపించి ఆడియన్స్‌ను మెప్పించడం కష్టం, కథలో బలం ఉండాలి.
రాజమౌళికి ఇప్పుడున్న ఏకైక పోటీ ఆయనే. ప్రతి సినిమాకు తనను తాను దాటుకుంటూ వెళ్లాలి. ఈ క్రమంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం పాకులాడి, తనను నమ్ముకున్న కోర్ ఆడియన్స్ (తెలుగు వాళ్లు) ఇష్టపడే ఎమోషన్స్‌ని పక్కన పెడితే మాత్రం రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉంది. వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది.. ఈ లాజిక్ జక్కన్న మర్చిపోకూడదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.