తమిళనాడులో జల్లికట్టుపై చేస్తున్న పోరాటం అనుకోని విధంగా మలుపుతిరిగింది. జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. జల్లికట్టుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కాబట్టి, ఆందోళన విరమించాలని, గణతంత్ర వేడుకలు మెరీనా తీరంలో నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడనుంచి ఖాళీ చేయాలని ఆందోళనకారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపనిదే తాము ఉద్యమం నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని ఉద్యమకారులు తేల్చిచెప్పడంతో సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగింది.
పోలీస్ స్టేషన్ సహా, పలు వాహనాలకు కొంతమంది నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ స్పందించారు. ‘జల్లికట్టు’ ఉద్యమకారులు శాంతించాలని, నిరసనలు, ఆందోళనలు విరమించాలని పిలుపునిచ్చారు. లేకుంటే అసాంఘిక శక్తులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఉద్యమకారులకు చెడ్డపేరు తీసుకువచ్చే ప్రమాదం ఉందని సూపర్ స్టార్ ట్విట్టర్లో ఓ లెటర్ ద్వారా కోరారు. డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కూడా గొడవలకు దిగకుండా విద్యార్థులు ఇంటికి చేరాలని వీడియోల ద్వారా చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.