చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాకు సుమారు రూ. 220 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇటీవలి కాలంలో చిరంజీవికే కాదు తెలుగు సీనియర్ స్టార్ హీరోల్లో ఎవరికీ ఇంతటి భారీ వసూళ్లు రాలేదు. అయితే ఈ విజయం వెనుక రజనీకాంత్ (Rajinikanth) ఉన్నారని మీకు తెలుసా? అవును, ఈ విషయం చిరంజీవి చెప్పారు. అంటే ఆ సినిమా కథ, నిర్మాత, నటుడు.. ఇలాంటి సాయం కాదు… ఆ కథను చిరంజీవి ఓకే చేయడంలో రజనీకాత్ ఉన్నారని అర్థమవుతోంది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చినప్పుడు చిరంజీవి ఏంటి? కొత్త దర్శకుడితో సినిమా ఏంటి? అనే ప్రశ్నలు వినిపించాయి. చిరును, అతని ఫ్యాన్ బేస్‌ను బాబీ హ్యాండిల్ చేయగలరా అనే ప్రశ్న కూడా వినిపించింది. అయితే అంచనాలకు మించి బాబీ ఆ సినిమాను అదరగొట్టారు. అందుకే చిరంజీవి కెరీర్‌లో తొలి రూ. 200 కోట్ల సినిమా ‘వాల్తేరు వీరయ్య’ నిలిచింది. అయితే ‘మీ దర్శకుడు మీ అభిమాని అయితే బాగుంటుంది. మంచి సినిమాలొస్తాయి’ అని రజనీ చెప్పిన మాటే ఆ సినిమాకు ఓ కారణమట.
కొన్ని రోజుల కిందట రజనీకాంత్ తనతో ఆ మాట చెప్పారని చిరంజీవి ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. మనం పని చేయాలనుకున్న లెజండరీ దర్శకులంతా ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా కొత్త దర్శకులే. ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులు అయితే, వారిపైనే ఆధారపడితే బాగుంటుంది. మనల్ని స్క్రీన్‌పై ఎలా చూపించాలి అనేది వాళ్లకు బాగా తెలుసు అని చిరంజీవితో రజనీకాంత్ అన్నారట. అలా ఆలోచించే బాబీతో కలసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేశారట.
ఆ సినిమా అభిమానులకు బాగా నచ్చిందని, కమర్షియల్‌గానూ హిట్టయిందని చిరు తెలిపారు. ఇక ఇప్పుడు చేస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) దర్శకుడు వశిష్ట (Mallidi Vasishta) కూడా తనకు పెద్ద అభిమాని అని చిరు అన్నారు. కచ్చితంగా అభిమాని దర్శకుడు అయితే మంచి అవుట్‌పుట్ ఇస్తారని చిరంజీవి విశ్లేషించారు. మరి ఈ మాటను సీనియర్ స్టార్ హీరోలు ఓసారి పరిశీలనలోకి తీసుకుంటారేమో చూడాలి.