బాలీవుడ్లో ‘జంజీర్’ సినిమా చాలా ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చాడు రామ్‌చరణ్. అయితే ఆ సినిమా దారుణమైన పరాజయం పాలైంది. అంతేకాదు అందులో రామ్‌చరణ్ నటన, లుక్స్ విషయంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో సినిమా విషయంలో చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు రెండో సినిమా విషయంలో వస్తున్న వార్తలు చరణ్ అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌కి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇచ్చిన రిప్లైనే దీనికి కారణం.
ఈ ఏడాది ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆ తర్వాత ఆయన ‘వ్యాక్సిన్ వార్’ అంటూ ఇటీవల ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా కూడా వివాదాలకు నెలవు అవుతుంది అని ఓ టాక్ నడుస్తోంది. అలాంటి దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు అనే లేటెస్ట్ గాసిప్ న్యూస్. వినడానికి, నమ్మడానికి ఏ మాత్రం అనువుగా లేని ఈ పుకారు రావడానికి కారణం వివేక్ అగ్నిహోత్రినే.
‘‘రామ్ చరణ్‌తో మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం’ ఓ నెటిజన్ పోస్ట్ పెడితే.. దానికి వివేక్ ‘మమ్మల్ని అలాగే బ్లెస్ చేయండి’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఏంటీ ఈ కాంబోలో సినిమానా? అంటూ ప్రశ్న మొదలైంది. ఈ సినిమా రావాలని బ్లెస్ చేయలా? లేక సినిమా వీలవ్వాలని బ్లెస్ చేయాలా అనే క్లారిటీ వివేక్ అగ్నిహోత్రి ఇవ్వలేదు. కానీ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నట్లు మాత్రం చెప్పకనే చెప్పారు. దీంతో ఈ కాంబో గురించి ఆలోచనలు మొదలయ్యాయి.
వివాదాల సినిమాలు చేసే వివేక్‌తో రామ్‌చరణ్ సినిమా అంటే ఇబ్బంది అనే కామెంట్స్ ఓవైపు, అలాంటి దర్శకుడితో చరణ్ సినిమా చేస్తే.. అదిరిపోతుంది. చరణ్‌లోని మరో కోణం చూడొచ్చు అని అంటున్నారు. మరి నిజంగానే చరణ్‌కు ఇలాంటి ఆలోచన ఉందా? ఉంటే చిరంజీవి ముందుకు వెళ్లనిస్తారా అనేది చూడాలి.