తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి మరో కోణంలో పరిచయం చేసిన సంవత్సరం 2022. మార్కెట్ పరంగా, క్రేజ్ పరంగా తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కిన ఏడాది ఇది. ఇదివరకు కూడా హిట్లు, బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అయితే.. ఈ ఏడాది బాలీవుడ్ & కోలీవుడ్ మీద తెలుగు సినిమా డామినేషన్ చూసి మురిసిపోయారు తెలుగోళ్ళు. 2022లో తెలుగు సినిమా చరిత్రలో కలికితురాయిలుగా నిలిచిన చిత్రాలేమిటో చూద్దాం..!!
బంగార్రాజు
నిజానికి చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. నాగార్జున-నాగచైతన్యల కాంబినేషన్ పుణ్యమా అని అక్కినేని ఫ్యామిలీ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. “సోగ్గాడే చిన్ని నాయన”కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హ్యూమర్, ఫైట్స్, రొమాన్స్ సమపాళ్లలో ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు. చెప్పుకోవడానికి ఒక ఫక్తు కమర్షియల్ సినిమానే అయినప్పటికీ.. ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
OTT Platform: Zee5
డీజే టిల్లు
తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కామెడీ ఎంటర్ టైనర్ “డీజే టిల్లు”. సిద్ధూ జొన్నలగడ్డ రచించి, నటించిన ఈ చిత్రం టైటిల్ క్యారెక్టర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది. సినిమా పాటలు, డైలాగ్స్ పాపులారిటీకి బడా బడా హీరోలు కూడా షాక్ అయ్యారంటే మామూలు విషయం కాదు. ఆఖరికి “అట్లుంటది మనతోని” అనే డైలాగ్ పోలిటికల్ మీటింగ్స్ లో కూడా వినిపించింది. ఈ సినిమాకి సీక్వెల్ “డీజే టిల్లు 2” ప్రస్తుతం సెట్స్ లో ఉంది. 2023లో ఈ సీక్వెల్ మరో సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
OTT Platform: Aha
ఆర్.ఆర్.ఆర్
ఒక తెలుగు సినిమాను తెలుగోళ్ల కంటే ఎక్కువగా ఫారినర్లు ఎక్కువగా ప్రేమించేలా చేసిన చిత్రం “ఆర్ ఆర్ ఆర్”. ఆస్కార్ కు సైతం “ఆర్ ఆర్ ఆర్” వెళ్ళగలిగిందంటే అందుకు కారణం ఫారిన్ కంట్రీస్ లో “ఆర్ ఆర్ ఆర్”ను ఓన్ చేసుకున్న విధానమే. చరణ్, ఎన్టీయార్ ఎలివేషన్స్, కీరవాణి సంగీతం, జక్కన్న దర్శకత్వం, సెంథిల్ సినిమాటోగ్రఫీ. ఇలా అన్నీ ప్లస్ పాయింట్స్ గా తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్స్ దాకా తీసుకెళ్లిన “ఆర్ ఆర్ ఆర్”కు కూడా సీక్వెల్ ఆలోచన ఉందని రాజమౌళి పేర్కొనడం విశేషం.
OTT Platform: Zee5, Netflix, Hotstar
అంటే సుందరానికి
కమర్షియల్ గా వర్కవుటై ఉండకపోవచ్చు కానీ.. 2022లో అందరి ఫేవరెట్ సినిమా “అంటే సుందరానికి” అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాని ఒక ఎంటర్ టైనర్ అని పేర్కొనడం కంటే.. ఒక పాత్ బ్రేకింగ్ సినిమాగా చెప్పుకోవడం సబబు. వివేక్ ఆత్రేయ ఒక దర్శకుడిగా, కథకుడిగా ఎన్నో స్టీరియోటైప్స్ ను బ్రేక్ చేసిన సినిమా ఇది. నాని, నజ్రియాల నటన కంటే. రోహిణి క్యారెక్టర్ & డైలాగ్స్ మనసుకి హత్తుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రతి ప్రేక్షకుడి కన్ను చెమర్చేలా చేయడం ఖాయం. బహుశా ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుటైయ్యుంటే బాగుండేదేమో కానీ.. రన్ టైమ్ మైనస్ గా మారింది.
OTT Platform: Netflix
సీతారామం
ఈ ఏడాది సంచలనం సృష్టించిన చిత్రాల్లో సీతారామం ఒకటి. ఒక స్వచ్చమైన ప్రేమకథ, హీరోహీరోయిన్ల నడుమ ఒక రోమాంటిక్ సీన్ కానీ, ఒక లిప్ లాక్ సీన్ కానీ లేకుండా కేవలం వారి మనసులు పడే మధనం నుండి పుట్టిన ప్రేమ “సీతారామం”. సినిమా విడుదలకు ముందు అసలు ఎలాంటి అంచనాలు లేవు. కనీసం ఇదొక సినిమా వస్తుందన్న బజ్ కూడా మార్కెట్ లేదు. కట్ చేస్తే.. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ కూడా “సీతారామం”కు ఫిదా అయిపోయారు. బడ్జెట్ వైజ్ చూసుకుంటే.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా “సీతారామం”ను పేర్కొనవచ్చు. దుల్కర్, మృణాల్ ఠాకూర్ ల మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ & హను రాఘవపూడి హానెస్ట్ టేకింగ్ కోసం ఈ సినిమాను ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు.
OTT Platform: Amazon Prime, Hotstar (Hindi)
ఒకే ఒక జీవితం
ఒక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాకు అమ్మ సెంటిమెంట్ యాడ్ చేసి ఈస్థాయిలో మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా “ఒకే ఒక జీవితం”. శర్వానంద్ నటన, అమల స్క్రీన్ ప్రెజన్స్ & జేక్స్ బిజోయ్ సంగీతం, శ్రీకార్తీక్ దర్శకత్వ ప్రతిభ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. అలాగే.. వెన్నెలకిషోర్, ప్రియదర్శిల క్యారెక్టర్ ఆర్క్స్ “ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ని ఇలా కూడా రాసుకోవచ్చు” అని కొత్త ఎగ్జాంపుల్ ను క్రియేట్ చేశాయి.
OTT Platform: Sonyliv
మసూద
ఆర్జీవి “రాత్రి” తర్వాత తెలుగులో సరైన హారర్ సినిమా రాలేదనే చెప్పాలి. ఆ లోటును పూడ్చిన చిత్రం “మసూద”. రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా.. మంచి సౌండ్ డిజైనింగ్ & ప్రొడక్షన్ డిజైన్ తో ఆడియన్స్ ను భయపెట్టిన చిత్రమిది. ట్రైలర్ విడుదలయ్యేంత వరకూ ఇదొక సినిమా ఉందని కూడా ఎవరికీ తెలియదు. కట్ చేస్తే.. థియేటర్లలో మసూద క్రియేట్ చేసిన మ్యాజిక్ కి అందరూ సరెండర్ అయిపోయారు. దెయ్యం పాత్రకి అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండా, హీరో క్యారెక్టర్ కి అనవసరంగా అతిగా ఎలివేట్ చేయకుండా.. చాలా సింపుల్ గా తెరకెక్కిన “మసూద” 2022 బెస్ట్ సినిమాల్లో మాత్రమే కాదు.. తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
OTT Platform: Aha
హీరో
టేకింగ్, డీలింగ్ & క్యారెక్టర్స్ పరంగా చాలా ఫ్రెష్ గా సాగే చిత్రం “హీరో”. అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తూ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం మంచి కామెడీతో అలరించింది. జగపతిబాబు క్యారెక్టర్ & క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్. వాటిని సరిగా యూటిలైజ్ చేసుకోకుండా.. నిధి అగర్వాల్ గ్లామర్ & కృష్ణ గారి రీమిక్స్ సాంగ్ ను ఎక్కువగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించడమే సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుతవ్వకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. అయినప్పటికీ.. శ్రీరామ్ ఆదిత్య సినిమాను తెరకెక్కించిన విధానం కోసం మాత్రం కచ్చితంగా చూడొచ్చు.
OTT Platform: Hotstar
భీమ్లా నాయక్:
ఒక మలయాళం రీమేక్, అది కూడా అమేజాన్ ప్రైమ్లో అందరూ పోటీపడి మరీ చూసేసిన సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది అంటే నిజానికి పెద్దగా అంచనాలు ఉండవు. కానీ.. పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు అందలాన్ని అంటాయి. త్రివిక్రమ్ రచనా సహకారంలో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ – రాణాల నటన & కాంబినేషన్ సీన్స్ హైలైట్స్ గా నిలిచాయి. తమన్ నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. గణేష్ మాస్టర్ “లా లా భీమ్లా”ను కంపోజ్ చేసిన విధానమే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. పవన్ ఫ్యాన్స్ కి చాన్నాళ్ల తర్వాత మంచి హై ఇచ్చిన సినిమా “భీమ్లా నాయక్”.
OTT Platform: Hotstar, Aha
మిషన్ ఇంపాజబుల్
“ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన సినిమా కావడం, బాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటున్న తాప్సీ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన సినిమా కావడంతో “మిషన్ ఇంపాజబుల్” మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చాలా హానెస్ట్ గా తీసిన సినిమా ఇది. అయితే.. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుటవ్వలేదు. ఈ చిత్రంలో “కాంతార” ఫేమ్ రిషబ్ శెట్టి ఓ చిన్న అతిధి పాత్రలో నటించడం విశేషం.
OTT Platform: Netflix
అశోక వనంలో అర్జున కళ్యాణం
తనకున్న మాస్ క దాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి.. విశ్వక్ సేన్ నటించిన సినిమా “అశోకవనంలో అర్జున కళ్యాణం”. లాక్ డౌన్ నేపధ్యంగా సాగే హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. విశ్వక్ నటన, రితీక నాయక్ స్క్రీన్ ప్రెజన్స్, రాజ్కుమార్ కాశిరెడ్డి కామెడీ, జై క్రిష్ సంగీతం హైలైట్స్ గా సాగే ఈ చిత్రం క్రిటిక్స్ & బాక్సాఫీస్ దగ్గర మంచి రిసెప్షన్ అందుకుంది.
OTT Platform: Aha
సర్కారువారి పాట
ఒక మూసలో కొట్టుకుపోతున్న మహేష్ ను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చిన చిత్రం “సర్కారువారి పాట”. హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ కొందరికి ఎక్కలేదు కానీ.. “ఖలేజా” అనంతరం మహేష్ అంత యాక్టివ్ గా, యూత్ ఫుల్ గా కనబడిన చిత్రమిదే. ముఖ్యంగా పరశురామ్ డైలాగ్స్ భలే ఉంటాయి. ఈ చిత్రం డే1 కలెక్షన్స్ ఇప్పటికీ పెద్ద హాట్ టాపిక్.
OTT Platform: Amazonprime
మేజర్
అడివి శేష్ సినిమాలంటేనే ఒక బ్రాండ్. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన అడివి శేష్ నుంచి 2022లో వచ్చిన ఒన్నాఫ్ ది హిట్ ఫిలిమ్ “మేజర్”. “గూడచారి” ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కింది. సినిమా నేపధ్యం ముంబైలో జరిగిన 26/11 ఎటాక్స్ అయినప్పటికీ.. సందీప్ జీవితం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి తెరకెక్కించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్నిచోట్లా ఘన విజయం సాధించింది.
OTT Platform: Netflix
విరాటపర్వం
2022 సంవత్సరానికి ఉత్తమ నటి అవార్డులు ఎన్ని ఉంటే అన్నీ సాయిపల్లవికే దక్కాలి అనిపించే స్థాయిలో ఆమె నటించిన చిత్రం “విరాటపర్వం”. స్వచ్చమైన, అమాయకమైన తెలంగాణ పడుచుగా ఆమె నటన, డైలాగ్ డెలివరీ “విరాటపర్వం” చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు వేణు ఉడుగుల కన్సీవ్ చేసిన విధానం, ఎండ్ చేసిన తీరు అద్భుతంగా ఉంటాయి. రాణా నటన కూడా బాగుంటుంది. కమర్షియల్ గా పెద్దగా వర్కవుటవ్వలేదు కానీ.. ఈ ఏడాది విడుదలైన బెస్ట్ లవ్ స్టోరీ “విరాటపర్వం”.
OTT Platform: Netflix
బింబిసార
పటాస్ తర్వాత సరైన హిట్ లేక కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఊపిరి పోసిన సినిమా “బింబిసార”. కొత్త దర్శకుడిగా కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగం ఇది. 2022లో సర్ప్రైజింగ్ హిట్స్ లో ఇదొకటి. సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టేసింది.
OTT Platform: Zee5
కార్తికేయ 2
ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకి బాలీవుడ్ మార్కెట్ లో ఈ స్థాయిలో రిసెప్షన్ వస్తుందని, అది కూడా నిఖిల్ రేంజ్ హీరో సినిమా బాలీవుడ్ మార్కెట్లో అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కృష్ణుడి సెంటిమెంట్, అనుపమ్ ఖేర్ అతిధి పాత్ర హైలైట్స్ గా “కార్తికేయ 2” బాక్సాఫీస్ రన్ ఎన్నో సినిమాలకు డ్రీమ్ రన్. బాలీవుడ్ మేకర్స్ కుల్లుకునేలా చేసిన ఈ చిత్రానికి పార్ట్ 3 కూడా వస్తుందని నిఖిల్ ఇటీవలే కన్ఫర్మ్ చేశాడు.
OTT Platform: Zee5
కృష్ణ వ్రిందా విహారి
“అంటే సుందరానికి” చిత్రానికి సింపుల్ వెర్షన్ “కృష్ణ వ్రిందా విహారి”. నాగశౌర్య, షెర్లీ జంతా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా.. సినిమాలోని హ్యూమర్ ను మాత్రం అందరూ ఎంజాయ్ చేశారు.
OTT Platform: Netflix
గాడ్ ఫాదర్
ఆల్రేడీ తెలుగులో అనువాదరూపంలో విడుదలైన “లూసిఫర్” ను రీమేక్ చేస్తున్నందుకు తిట్టుకోని మెగా అభిమాని లేడు. ఈ మలయాళ సినిమా రీమేక్ ను తమిళ దర్శకుడు జయం మోహన్ రాజా చేతిలో పెట్టడం, టీజర్ చాలా యావరేజ్ గా ఉండడంతో సినిమా ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. కట్ చేస్తే.. మోహన్ రాజా టేకింగ్ కి ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. “కాంతార” మ్యానియాలో కొట్టుకుపోయింది కానీ.. ఇంకాస్త మంచి రిలీజ్ ప్లాన్ చేసి ఉంటే కమర్షియల్ గానూ వర్కవుటయ్యేది.
OTT Platform: Netflix
యశోద
సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “యశోద”. క్లైమాక్స్ ట్విస్ట్ & గ్రాఫిక్స్ బాగా ట్రోల్ అయినప్పటికీ.. సినిమాలో ఆమె నటనకు మాత్రం ఎవరూ పేర్లు పెట్టలేదు. సరోగసీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ హిట్ అయిన్నప్పటికీ.. సమంత కెరీర్లో ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది.
OTT Platform: Amazon Prime
హిట్ 2
అడివి శేష్ నటించగా ఈ ఏడాది హిట్టయిన మరో చిత్రం “హిట్ 2”. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. కొన్ని ఏరియాల్లో ఎగ్జిబిటర్లకు ప్రాఫిట్స్ తీసుకురావడంలో విఫలమైనప్పటికీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాలో సుహాస్ పాత్రను ఎలివేట్ చేసిన విధానానికే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. అందుకే.. హిట్ 1 స్థాయిలో హిట్ 2 సంచలనం సృష్టించలేకపోయింది.
OTT Platform: Amazon Prime