Ram Nagar Bunny Review in Telugu: రామ్ నగర్ బన్నీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • చంద్రహాస్ (Hero)
  • విస్మయ శ్రీ (Heroine)
  • రిచా జోషి, రీతు మంత్ర, మురళీధర్ గౌడ్ (Cast)
  • శ్రీనివాస్ మహత్ (Director)
  • ప్రభాకర్ పొడకండ్ల - మలయజ ప్రభాకర్ (Producer)
  • అశ్విన్ హేమంత్ (Music)
  • ఆస్కర్ అలీ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 04, 2024

సినిమా ఓపెనింగ్ రోజునే తన యాటిట్యూడ్ తో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యాడు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. తన తల్లిదండ్రులు స్వయంగా నిర్మించిన చిత్రంతో హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “రామ్ నగర్ బన్నీ”. రచయిత వెలిగొండ శ్రీనివాస్ తన పేరును శ్రీనివాస్ మహత్ గా మార్చుకుని దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 04) విడుదలైంది. సినిమా నచ్చకపోతే.. మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చంద్రహాస్ ప్రీరిలీజ్ ఈవెంట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. మరి “రామ్ నగర్ బన్నీ” ఆడియన్స్ ను అలరించిందా? లేక చంద్రహాస్ అందరికీ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అనేది చూద్దాం..!!

Ram Nagar Bunny Review

కథ: ఆటో నడిపే తండ్రి సంపాదనతో జులాయిగా తిరిగే సగటు కుర్రాడు బన్నీ (చంద్రహాస్). అందంగా కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూ.. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటీ అనే అర్థం కూడా తెలుసుకోకుండా ఒకరి తర్వాత ఒకర్ని ప్రేమించుకుంటూ వెళ్తుంటాడు.

ఆ క్రమంలో పరిచయమైన అమ్మాయిలందరిలో తన ఇంట్లో పని మనిషి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి (విస్మయ) తనకు బెస్ట్ అని తెలుసుకొనేలోపు బన్నీ జీవితం తార (రీతు మంత్ర) చేతిలో పడిపోతుంది.
అసలు తార ఎవరు? బన్నీ ఆమె దగ్గర ఎలా ఇరుక్కున్నాడు? ప్రేమ విలువ ఎలా తెలుసుకున్నాడు? అనేది “రామ్ నగర్ బన్నీ” గాడి కథ.

నటీనటుల పనితీరు: నటుడిగా చంద్రహాస్ పర్వాలేదు అనిపించుకున్నాడు. నటన, డ్యాన్సులు, ఫైట్ల విషయంలో మంచి పరిణితి కనబరిచాడు. అయితే.. మరీ త్వరగా ఎంట్రీ ఇచ్చేసాడు అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది.

ఉన్న హీరోయిన్లందరిలో విస్మయ చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకి పెద్ద వెయిటేజ్ లేకపోయినా.. ఆమె మాత్రం తన వందశాతం ఇచ్చింది. ఇక రొమాంటిక్ సీన్స్ లో ఆమె చూపిన తెగువకు బోలెడన్ని ఎంక్వైరీలు రావడం ఖాయం.

మురళీధర్ గౌడ్ కాస్తంత నవ్వించే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడా విజయం సాధించాడు కూడా. కీలకపాత్రలో రీతు మంత్ర నటించడానికి విశ్వప్రయత్నం చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇక మిగతా హీరోయిన్లు రిచా జోషి, అంబిక వాణి ఏదో ఉన్నాం అనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: రచయితగా “ఢమరుకం, అఖిల్, పండగ చేస్కో” వంటి భారీ కమర్షియల్ సినిమాలకు వర్క్ చేసిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగానూ “సకలగుణాభి రామ” అనే చిత్రంతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కొంచం గ్యాప్ తీసుకొని, పేరు కూడా మార్చుకుని “శ్రీనివాస్ మహత్”గా ఈ “రామ్ నగర్” బన్నీతో దర్శకుడిగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. రచయితగా, దర్శకుడిగా కనీస స్థాయి మార్కులు సంపాదించుకోలేకపోయాడనే చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్స్ లో లాజిక్స్ అనేవి అవసరం లేదు సరే, కానీ కనీస స్థాయి కథ-కథనం ఉండాలి అనే విషయాన్ని ఎందుకు విస్మరించాడో అర్థం కాలేదు. అనవసరమైన శృంగార సన్నివేశాలు, కథకు ఏమాత్రం సంబంధం లేని హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ షాట్స్ తో సినిమాని కవర్ చేయడానికి ప్రయత్నించాడు.

ఎంత యూత్ ఆడియన్స్ టార్గెట్ అయినప్పటికీ.. వాళ్లు కూడా కేవలం ఈ లిప్ లాక్స్ & హీరోయిన్ నడుము చూసి థియేటర్ కి వచ్చేస్తారు అనే మూసలో ఈ 2024లోను ఉండిపోవడం బాధాకరం. ఒక్కటంటే ఒక్క పాత్రకు కూడా సరైన జస్టిఫికేషన్ లేదు. ఏదో అలా వచ్చిపోతుంటారు. హీరోను బాగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇరికించిన ఫైట్లు, రొమాంటిక్ సీన్స్ వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్ గా.. దర్శకుడిగా రెండో సినిమాతోనూ అలరించలేక విఫలమయ్యాడు వెలిగొండ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ మహత్.

అశ్విన్ హేమంత్ పాటలు ఓ మోస్తరుగా ఉన్నా.. నేపథ్య సంగీతంతో మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆస్కర్ అలీ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగుంది. బడ్జెట్ తక్కువ అయినా ఆ లోటు ఫ్రేమ్స్ లో కనిపించనివ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా పేలవంగా ఉన్నాయి.

విశ్లేషణ: రొటీన్ కమర్షియల్ సినిమా అనేది ఒక తేనెపట్టు లాంటిది. నేర్పుతో హ్యాండిల్ చేయగలిగితే చక్కగా ఆస్వాదించవచ్చు. లేకపోతే మాత్రం దారుణంగా బెడిసికొడుతుంది. “రామ్ నగర్ బన్నీ” విషయంలో అదే జరిగింది. కథ-కథనంలో కనీస స్థాయి కొత్తదనం లేకపోగా.. డబుల్ మీనింగ్ జోకులు, పంచులు ఇబ్బందిపెడతాయి. అలాగే.. హీరోయిన్స్ తో రొమాన్స్ సీన్స్ కూడా కాస్తంత పరిధి దాటారు. ఆ కారణంగా “రామ్ నగర్ బన్నీ” మూడురోజుల ముచ్చటగా మిగిలిపోయింది. తండ్రి ప్రభాకర్ & కొడుకు చంద్రహాస్.. ఇద్దరికీ మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు కాకుండా, కాస్త టైమ్ తీసుకొని మంచి సెన్సిబుల్ సినిమాలతో వస్తే మాత్రమే చంద్రహాస్ హీరోగా నిలదొక్కుకోగలుగుతాడు. ఈ తరహా పాత్రలు చేసుకుంటూపోతే “చంద్రహాస్” అనే నటుడు సోషల్ మీడియా ట్రోల్స్ కి పరిమితం అయిపోవాల్సి వస్తుంది.

ఫోకస్ పాయింట్: ఇలాగైతే కష్టమే చంద్రహాస్!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus