టాలీవుడ్‌లో హీరో పేరు కంటే, ఆ పేరు ముందు తగిలించుకునే ట్యాగ్ కే ఎక్కువ విలువ. మెగాస్టార్, పవర్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు ప్రతి హీరోకి ఒక బ్రాండ్ నేమ్ ఉండాల్సిందే. అయితే ఈ బిరుదుల వెనుక పెద్ద యుద్ధమే జరుగుతుంటుందని, ఒకరి టైటిల్ మరొకరు హైజాక్ చేసేస్తారని ఇన్నాళ్లూ గుసగుసలు ఉండేవి. ఇప్పుడు ఆ విషయాన్ని రామ్ పోతినేని స్వయంగా బయటపెట్టి, ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపారు.
RAM POTHINENI
కెరీర్ మొదట్లో రామ్‌కు ఈ ట్యాగ్స్, బిరుదులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. కానీ ఫ్యాన్స్, నిర్మాతల సరదా కాదనలేక ఒక టైటిల్ పెట్టుకోవడానికి ఓకే చెప్పాడు. రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు ఒక క్రేజీ ట్యాగ్‌ను డిసైడ్ కూడా చేశారు. కానీ సీన్ కట్ చేస్తే.. అనుకోకుండా మరో స్టార్ హీరో ఆ ట్యాగ్‌ను తన సినిమా టైటిల్ కార్డ్స్‌లో వాడేసుకున్నారట. ఇది చూసి రామ్ షాక్ అయినా, గొడవలు ఎందుకని సైలెంట్‌గా ఆ బిరుదును త్యాగం చేసేశారట.
ఆ హీరో ఎవరు? ఆ హైజాక్ అయిన ట్యాగ్ ఏంటి? అనే సీక్రెట్‌ను మాత్రం రామ్ రివీల్ చేయలేదు. చాలా హుందాగా ఆ విషయాన్ని దాటేశారు. ఆ తర్వాత రామ్‌కు ‘ఎనర్జిటిక్ స్టార్’ అనే ట్యాగ్ దక్కింది. నిజానికి రామ్ ఎనర్జీకి ఈ పదం పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం ‘ఉస్తాద్’ అని మార్చుకున్నా, అది ఆడియన్స్‌కు అంతగా ఎక్కలేదు. అందుకే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో మళ్ళీ తన పాత బ్రాండ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ వైపే మొగ్గు చూపారు.
కేవలం రామ్ మాత్రమే కాదు, ఇప్పుడు చాలామంది హీరోలు కొత్త ప్రయోగాలు పక్కనపెట్టి పాత ట్యాగ్స్‌నే నమ్ముకుంటున్నారు. ఉదాహరణకు రామ్ చరణ్ కూడా ‘గ్లోబల్ స్టార్’ అని వేసుకున్నా, ఫ్యాన్స్ మాత్రం ‘మెగా పవర్ స్టార్’ అనే పిలవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో చరణ్ కూడా మళ్ళీ పాత టైటిల్‌కే ఫిక్స్ అయ్యారు. కొత్తవి ఎంత గొప్పగా ఉన్నా, పాత ట్యాగ్స్‌లో ఉన్న ఎమోషన్ వేరని హీరోలకు అర్థమైనట్లుంది.