మన హీరోలకు ఖాకీ అంటే భలే ఇష్టం. పోలీసు పాత్రలో తమ హీరో కనిపిస్తే చూసి మురిసిపోవాలని అనుకోని అభిమానులూ ఉండరు. అందుకు తగ్గట్టే పోలీసు సినిమాలు బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లే సాధించి పెట్టాయి. మన హీరోలకు ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి కూడా. అయితే రామ్ ఇన్నేళ్ల కెరీర్లో ఫుల్ లెంగ్త్ పోలీసు క్యారెక్టర్ చేయలేదు. ఈ పాయింట్ పట్టుకునే లింగుస్వామి… రామ్‌ను ఒప్పించారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ విషయంలో చాలా రకాల పుకార్లు వస్తున్నాయి. వాటిలో కొత్తది వచ్చి చేరింది. అదే ఈ సినిమా పోలీసు కథ అని. రామ్ ఇప్పటికే ఒకసారి పోలీసు పాత్రలో కనిపించాడు. అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అందులోనూ ఎక్కువసేపు అలా కనిపించడు. అదే ‘ఇస్మార్ట్ శంకర్’. దీంతో పోలీసు పాత్ర ముచ్చట తీర్చుకుందాం అనుకున్నాడో, మాస్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అనుకున్నాడో లింగుస్వామి పోలీసు సబ్జెక్ట్‌కు రామ్ ఓకే చెప్పేశాడట.
అయితే రామ్ – లింగుస్వామిల సినిమా ఫ్యాక్షన్ కథ అవుతుందని ఈ మధ్య వార్తలొచ్చాయి. కొత్త పుకార్ల ప్రకారం చూస్తే ఈ సినిమా ఫ్యాక్షన్ – పోలీసు కాంబినేషన్లో రూపొందబోతోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. అన్నట్లు ఇందులో కృతి శెట్టిని హీరోయిన్గా చిత్రబృందం ఫైనల్ చేసింది. ఆమె కాకుండా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని వార్తలొస్తున్నాయి. అన్నీ బాగుంటే ఈ పాటికి సినిమా సెట్స్‌పైకి వెళ్లేది. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు చిత్రీకరణలు మొదలైతే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్. సో వివరాల కోసం వెయిట్.