నిన్నటి తరం హీరోయిన్స్ అయిన రమ్యకృష్ణ, నదియా, ఇంద్రజ, ఆమని, మీనా, భూమికలు నేటితరం హీరోయిన్స్ తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈసారి అందంతో కాకుండా అనుభవం, అభినయంతో పోటీ పడుతున్నారు. కీలక పాత్రల్లో నటించి అభిమానుల అభినందనలతో పాటు.. భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అందుకే ఈ బాటలో మరో హీరోయిన్ నడవనుంది. ఆమె ఎవరో కాదు.. హిట్లర్, బావగారు బాగున్నారా సినిమాల్లో చిరంజీవితో కలిసి స్టెప్స్ వేసిన రంభ. హీరోయిన్ గా అనేక హిట్స్ అందుకున్న ఈమె పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరమైంది. దుబాయ్ లో స్థిరపడింది. గత ఏడాది భర్తతో గొడవపడి ఇండియాకి వచ్చిన ఆమె టీవీ షోలలో జడ్జిగా వ్యవహరించింది.
మంచి రోల్ దొరికితే రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూసింది. తాజాగా ఆ రోల్ దొరకడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రం శ్రీకాకుళం తీసిన ఈశ్వర్ చెప్పిన కథ, ఆ కథలో తన రోల్ నచ్చడంతో అతని దర్శకత్వంలో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంభ సిద్ధమైంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటించనున్నారు. కామెడీ పంచ్ లకు పేరుగాంచిన రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి మాటలు రాయడంలో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.