Rangabali Review in Telugu: రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నాగశౌర్య (Hero)
  • యుక్తి తరేజా (Heroine)
  • షైన్ టామ్ చాకో, సత్య, గోపరాజు రమణ, శరత్ కుమార్ తదితరులు.. (Cast)
  • పవన్ బాసంశెట్టి (Director)
  • సుధాకర్ చెరుకూరి (Producer)
  • పవన్ సీహెచ్ (Music)
  • దివాకర్ మణి - వంశీ పచ్చిపులుసు (Cinematography)
  • Release Date : జులై 07, 2023

యువ కథానాయకుడు నాగశౌర్య ఒక మంచి కమర్షియల్ సక్సెస్ సాధించి చాన్నాళ్లయిపోయింది. దాంతో.. ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా, ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో హిట్ కొట్టాలనే ధ్యేయంతో నటించిన సినిమా “రంగబలి”. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కంటే సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్పూఫ్ ఇంటర్వ్యూ ఎక్కువ వైరల్ అయ్యింది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: జనాల దృష్టి తనవైపు ఉండడం కోసం ఏమైనా చేసే కుర్రాడు శౌర్య (నాగశౌర్య). తన మెడికల్ షాప్ చూసుకుంటే చాలు అనుకునే తండ్రి బలవంతం మేరకు వైజాగ్ వెళ్ళి అక్కడ జూనియర్ డాక్టర్ సహజ (యుక్తి తరేజా) దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. ఆమె నుంచి మెడికల్ పాఠాలు నేర్చుకొనే బదులు.. ప్రేమపాఠాలు నేర్పిస్తాడు. కట్ చేస్తే.. సహజను పెళ్లి చేసుకోవడానికి శౌర్య ఒక పెద్ద పని చేయాల్సి వస్తుంది.

అసలు సహజ ఎవరు? ఆమెను పెళ్లి చేసుకోవడానికి శౌర్యకి ఎదురైన సమస్యలు ఏమిటి? “రంగబలి” అనే పేరుకి, జంక్షన్ కి, శౌర్య-సహజల పెళ్ళికి ఉన్న లింక్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “రంగబలి” చిత్రం.

నటీనటుల పనితీరు: జులాయి యువకుడిగా శౌర్య నటన, బాడీ లాంగ్వేజ్ & డైలాగ్ డెలివరీతో అలరించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో విశేషంగా నవ్వించాడు. యుక్తి తరేజా నటిగా పర్వాలేదనిపించుకున్నా.. ఒక రోమాంటిక్ సాంగ్ లో మాత్రం అందాల విందుతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ పాట చిత్రీకరణ కూడా బాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో.. యూత్ ఆడియన్స్ నోరెళ్ళబెట్టడం ఖాయం.

నాగశౌర్య తర్వాత సినిమాకి మరో హీరోగా సత్యను చెప్పొచ్చు. ఆల్రెడీ స్పూఫ్ ఇంటర్వ్యూతో అందరి దృష్టిని ఆకర్షించిన సత్య.. ఈ సినిమాలో ఎదుటివాడి సంతోషాన్ని చూసి ఓర్వలేని శాడిస్ట్ గా విశేషంగా అలరించాడు. ముఖ్యంగా బాంబ్ సీక్వెన్స్ లో సత్య నటన థియేటర్లో జనాలు ఘోల్లుమనేలా చేస్తుంది. గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, మురళీశర్మ, అనంత్ శ్రీరామ్ తదితరులు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి & వంశీ పచ్చిపలుసుల పనితనాన్ని మెచ్చుకోవాలి. శౌర్య ఇంట్రడక్షన్ సీన్ పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. యాక్షన్ బ్లాక్స్ & కొన్ని సీక్వెన్స్ లు కంపోజ్ చేసిన తీరు బాగుంది. పవన్ సీహెచ్ బాణీల్లో ఒక్కటి కూడా సరిగా రిజిష్టర్ అవ్వలేదు. కనీసం నేపధ్య సంగీతం కూడా సినిమాలోని సన్నివేశాలను, ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయింది. దర్శకుడు పవన్ బాసంశెట్టి రాసుకున్న కథలో పాయింట్ బాగున్నప్పటికీ.. ఆ పాయింట్ ను ఎలివేట్ చేయడానికి రాసుకున్న సన్నివేశాల్లో పస లేదు.

ముఖ్యంగా ఫస్టాఫ్ విశేషంగా అలరించగా.. సెకండాఫ్ పూర్తి విరుద్ధంగా ఎలాంటి ఫన్ లేకుండా కేవలం యాక్షన్ బ్లాక్స్ & ఎమోషనల్ సీన్స్ తో నడిపించాలనుకోవడం పెద్ద మైనస్ అయ్యింది. అందువల్ల.. ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ మరో సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సెకండాఫ్ కూడా సత్య పాత్ర టెంపోను కంటిన్యూ చేసి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఓవరాల్ గా దర్శకుడిగా పవన్ బాసంశెట్టి పర్వాలేదనిపించుకున్నాడు.

విశ్లేషణ: ఫస్టాఫ్ లో సత్య హిలేరియస్ కామెడీ ఎపిసోడ్స్ అండ్ శౌర్య కాంబినేషన్ సీన్స్ కోసం, సెకండాఫ్ యుక్తి తరేజా అందాల విందు, కాస్త తేడాగా చెప్పినా.. ప్రస్తుత సమాజానికి కావాల్సిన నీతిని వివరించినందుకు “రంగబలి” (Rangabali) సినిమాను ఒకసారి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. శౌర్య మళ్ళీ కమర్షియల్ హిట్ కొట్టేసినట్లే.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus