ధ్రువ్ సర్జా హీరోగా కన్నడలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ అనే హిందీ పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ పాటలో ద్వందార్థాలు ఎక్కువగా ఉన్నాయని, స్టెప్‌లు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఆ పాటను సినిమాలో లేకుండా చూడాలని, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెన్సార్ బోర్డును కోరింది.
ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతేకాదు ఇలాంటి అసభ్యకర కంటెంట్ ఉన్న పాటలు ఇకపై సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆ పాటను హిందీలో రాసిన గీత రచయిత రకీబ్ ఆలం మాట్లాడారు. ఆ పాట సాహిత్యాన్ని తాను రాయలేదు. రాయమని అడిగిన నిర్మాతల ప్రతిపాదనని కూడా తిరస్కరించానని తెలిపారు.
ఆ పాట మాతృకకు చిత్ర దర్శకుడు ప్రేమ్ కన్నడలో సాహిత్యం అందించారు. ఆ పాట ఇచ్చి దీన్ని హిందీలో రాయమని అడిగినప్పుడు ఇలాంటి పాటలకు ఆదరణ రాదని, సెన్సార్ బోర్డు నుండి అభ్యంతరాలు వస్తాయని నిరాకరించానని రకీబ్ ఆలం చెప్పారు. అయితే తాము రాసిన కన్నడ వెర్షన్‌ను ఉన్నది ఉన్నట్టుగా హిందీలోకి అనువదించి ఇవ్వమని అడిగారని, తర్వాత పాటకి తగ్గట్టుగా తామే సరిచేసుకుంటామని తనతో చెప్పారని రకీబ్ చెప్పారు.
కానీ పాట బయటికొచ్చే సరికి సాహిత్యం అసభ్యకరంగా ఉందని, ఇప్పుడు దీనికి వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో మంచి సాహిత్యంతో కొత్త వెర్షన్‌ను రాయమని చిత్రబృందం తననున కోరిందని చెప్పారు. త్వరలోనే క్షమాపణ నోట్‌తో ఆ పాటను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ధ్రువ్ సర్జా ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్ దత్ ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.