ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే యంగ్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ విలక్షణ పాత్రల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు రావురమేష్. శ్రీకారం సినిమాలో హీరో తండ్రి పాత్రలో రైతుగా నటించిన రావురమేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పుట్టగొడుగుల వ్యాపారం చేసి నష్టపోయానని ప్రేక్షకులకు తెలియని ఆసక్తికరమైన విషయాలను రావురమేష్ వెల్లడించారు.
సినిమాలో తాను రైతు పాత్రతో సక్సెస్ అయినా నిజ జీవితంలో మాత్రం రైతు పాత్రలో ఫెయిల్ అయ్యానంటూ రావురమేష్ చెప్పుకొచ్చారు. తాను 1995 సంవత్సరంలో మద్రాస్ లో ఉన్నానని ఆ సమయంలో వ్యవసాయంలో కొన్ని విన్యాసాలు చేశానని రావురమేష్ అన్నారు. ఆ సమయంలో పుట్టగొడుగుల వ్యాపారం చేసి చాలామంది లాభాలు సొంతం చేసుకోవడంతో తాను కూడా అలా వ్యాపారం చేయాలని అనుకున్నానని చెప్పారు. న్యూస్ పేపర్ లో పుట్టగొడుగుల బిజినెస్ ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చని తెలిసి పుట్టగొడుగులు వేశానని కానీ వేసిన తరువాత పుట్టగొడుగులు పండించడం అంత సులభం కాదని అర్థమైందని రావురమేష్ అన్నారు.
పుట్టగొడుగులు అమ్మి డబ్బులు సంపాదించాలని అనుకుంటే చివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని రావురమేష్ చెప్పుకొచ్చారు. అలా రైతుగా, బిజినెస్ మేన్ గా తాను ఫెయిల్ అయ్యానని రావురమేష్ తెలిపారు. శ్రీకారం సినిమాలో రావురమేష్ పాత్రను దర్శకుడు కిషోర్ అధుతంగా తీర్చిదిద్దారు. ఈ పాత్రకు రావురమేష్ మాత్రమే సూట్ అవుతారు అనేంత అద్భుతంగా రావురమేష్ ఆ పాత్రలో జీవించారు. చిత్తూరు యాసలో రావు రమేష్ చెప్పిన డైలాగులు బాగున్నాయి.