నాకోసం నేను సన్నబడ్డాను : రాశీఖన్నా

కథానాయికగా పరిచయమైన తొలినాళ్లలో అందరూ ఆమెను బొద్దుగుమ్మ అనేవారు. కానీ.. ఆ బొద్దుతనం రానురానూ భారీతనంగా కన్వర్ట్ అవ్వడాన్ని వెంటనే గుర్తించి ఎవ్వరూ ఊహించని స్థాయిలో సన్నబడి అప్పటివరకూ ఆమెను గేలి చేసినవారందరికీ గట్టి సమాధానమిచ్చింది రాశీఖన్నా. సగానికి పైగా తగ్గడంతోపాటు రెండింతలు ఎనర్జీ లెవల్స్ తో వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సన్నద్ధమవుతోంది. ఆమె నటించిన తాజా చిత్రాల్లో ఒకటైన “టచ్ చేసి చూడు” ఈవారం (ఫిబ్రవరి 2) విడుదలవుతోంది. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదలను పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించిన రాశీఖన్నా చెప్పిన సరదా విషయాలు మీరూ చదివి తెలుసుకోండి..!!

అప్పుడు బెల్లం శ్రీదేవి, ఇప్పుడు పుష్ప..
బేసిగ్గా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. కానీ తెలుగులో హీరోయిన్స్ కి సరిగా నటించడానికే సరిగా అవకాశాలు రావు. అలాంటప్పుడు ఇక కామెడీ పండించే రోల్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. కానీ.. “సుప్రీమ్”లో బెల్లం శ్రీదేవి రోల్ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా నా క్యారెక్టర్ ను జనాలు బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ “టచ్ చేసి చూడు”లో పుష్పగా నవ్వించనున్నాను. నా క్యారెక్టర్ మరీ డిఫరెంట్ గా ఉండదు కానీ.. ఎంటర్ టైనింగ్ గా మాత్రం ఉంటుంది.

నాకు రవితేజ కంపెనీ చాలా ఇష్టం..
“బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు” ఇలా వరుసబెట్టి ఆయన చిత్రాల్లో రవితేజ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. కాకపోతే నేను ఆయన కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పటికిప్పుడు ఆయన ఇంకో సినిమాలో కలిసి నటించమని అడిగినా నేను రెడీ.

డబ్బింగ్ చెప్పాలనుంది కానీ..
తెలుగు ఇప్పుడు పూర్తిగా అర్ధమవుతుంది, మాట్లాడగలుగుతున్నాను కూడా. కానీ.. డబ్బింగ్ చెప్పుకోవడానికి మాత్రం టైమ్ సరిపోవడం లేదు. “టచ్ చేసి చూడు, తొలిప్రేమ” చిత్రాల్లో డబ్బింగ్ చెప్పుకోవాలని ప్రయత్నించాను కానీ వర్కవుట్ అవ్వలేదు. భవిష్యత్ లో తప్పకుండా ప్రయత్నిస్తాను.

ఏం చేయమంటారు మంచి పాత్రలు అక్కడే వస్తున్నాయి..
తెలుగులో ఇన్నాళ్ల నుండి నటిస్తున్నాను కానీ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర ఒక్కటి కూడా రాలేదు. కానీ.. మలయాళంలో ఇటీవల “విలన్” అనే సినిమాలో మోహన్ లాల్ గారితో కలిసి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ప్లే చేయడం చాలా సంతోషమనిపించింది. అలాగే తమిళంలో కూడా అధర్వతో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. అది కూడా పెర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యమున్న రోల్. ఎందుకనో తెలుగులో ఆ తరహా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ నాకు ఇప్పటివరకూ రాలేదు. త్వరలో వస్తాయన్న నమ్మకం మాత్రం ఉంది.

ఎవరో వెటకారం చేశారని బాధపడను..
నా గురించి ఏమాత్రం తెలియని ఓ అనామకుడు నా శరీరాకృతి గురించి చెడుగా మాట్లాడాడని నేను అస్సలు పట్టించుకోను. నేను వాడికి మహా అయితే అయిదారేళ్ళ నుంచి తెలుగు నాకు నేను 27 ఏళ్ల నుంచి తెలుసు. అందుకే ట్విట్టర్, ఫేస్ బుక్ లో నాగురించి కానీ.. నా పర్సనాలిటీ గురించి కానీ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే నేను అస్సలు పట్టించుకోను.

ఒక్కోసారి పొగడ్తలు కూడా శ్రుతిమించుతుంటాయి..
బ్యాడ్ కామెంట్స్ కంటే ఎక్కువగా శృతి మించిన పొగడ్తలు నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరుస్తుంటాయి. వాటిని చూసి నవ్వుకొంటుంటాను. కానీ.. మనస్ఫూర్తిగా ఎవరైనా ప్రశంసిస్తే మాత్రం సంతోషిస్తాను.

నయనతారతో కాంబినేషన్ సీన్ లేదు..
తమిళంలో నటించిన చిత్రంలో నయనతార కూడా కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ.. ఆమెతో నేను స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ అలాంటి గొప్ప స్టార్ హీరోయిన్ తో కలిసి పని చేయకపోయినా ఆమె నటించిన సినిమాలో వర్క్ చేయడం మాత్రం చాలా ఆనందంగా ఉంది.

నాకోసం నేను సన్నబడ్డాను..
ఎవరో ఏదో అంటున్నారనో లేక సినిమాలో అవకాశాల కోసమో నేను సన్నబడలేదు. నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా కోసం నేను సన్నబడ్డాను. అయితే.. నేను సన్నబడడం “తొలిప్రేమ” సినిమాలో డిఫరెంట్ స్టేజస్ క్యారెక్టర్స్ చేసేప్పుడు బాగా ఉపయోగపడింది.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus