స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చాక.. జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్లి అదే ఇమేజ్‌ని ఎక్కువ రోజులు నిలుపుకోవడం గతంలో మనం చాలామంది విషయంలో చూశాం. దాని వల్ల లాంగ్ కెరీర్‌లు వారి సొంతమయ్యాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ల ఆలోచనా విధానం అలా లేదు. స్టార్ హీరోయిన్ ఇమేజ్ విత్ గ్లామర్ డాల్ కాన్సెప్ట్‌కి వారు పూర్తిగా దూరం. స్టార్ స్టేటస్ ఉండగానే.. ప్రయోగాలకు వెళ్తున్నారు. అక్కడ అనుకున్నంత విజయం సాధించకపోయినా మళ్లీ మళ్లీ ట్రై చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రయోగానికి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన. ‘మైసా’ అంటూ ఆమె ఓ డీ గ్లామర్ పాత్రతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం గ్లామర్‌నే వదిలేయడమే కాదు.. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చేస్తోంది. దీని కోసమే ఇప్పటికే కొన్ని శిక్షణలు కూడా తీసుకొంది. వాటి సాయంతో ఇటీవల అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి చేసింది. గంట కాదు, రెండు గంటలు కాదు.. ఏకంగా 20 గంటలు ఈ సన్నివేశాల్ని తెరకెక్కించారట. ఇప్పుడు ఇదే ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్.
రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ‘మైసా’ సినిమాలో గోండు గిరిజన యువతిగా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రాధాన్యమున్న ఈ సినిమా కోసం ఆమె మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు నీటి అడుగున సాగే క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌ని రెండు రోజుల పాటు (దాదాపు 20 గంటలు) నీటిలో ఉండి పూర్తి చేసింది. దీని గురించి ఆమె మాట్లాడింది కూడా.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఆ సమయంలో ఈ సీక్వెన్స్‌లో నిమగ్నమై ఉన్నాం. నా కెరీర్‌లో నేను చేసిన వాటిలోకెల్లా ఇది అత్యంత సవాలుతో కూడుకున్న సీక్వెన్స్. దీని కోసం చాలా కష్టపడ్డాం. ఈ అనుభవం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ పోరాట ఘట్టాన్ని డూప్ లేకుండా చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ‘మైసా’ టీజర్‌ని చిత్రబృందం విడుదల చేయనుంది. అందులో ఈ సీన్ గ్లింప్స్ ఏమైనా పెడతారేమో చూడాలి.