‘యానిమల్’ సినిమా వచ్చినప్పటి నుండి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి, హీరో రణ్‌బీర్ కపూర్ గురించే మాట్లాడుతున్నారు. అలాంటి కథ రాసుకోవడం, హీరోను ఒప్పించడం ఒకెత్తు అయితే… ఇలాంటి కథతో ప్రేక్షకుల్ని మెప్పిచగలను అనే నమ్మకం ఆ హీరోకు కలగడం మరో ఎత్తు. అయితే ఇలాంటి కథలో కాస్త బోల్డ్ సీన్ ఉన్న పాత్రలో నటించడం కూడా హీరోయిన్లకు కష్టమే. అలాంటి పనే చేసి చూపించి మెప్పించింది రష్మిక మందన.
ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో రష్మిక తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సినిమా గురించి, తన పాత్ర గురించి, క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి రష్మిక మాట్లాడింది. ‘యానిమల్’ సినిమా విడుదలైన రోజు నుండి ప్రశంసలు వస్తున్నాయి. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది. నటిగా నాకు గీతాంజలి ఎంతో నచ్చింది. గీతాంజలి పాత్ర చిత్రీకరణ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్న రష్మిక… గీతాంజలి పాత్రను ఒక్క మాటలో వర్ణించాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి ఆమే అని చెబుతా అని అంది.
గీతాంజలి మనసు ఎంతో స్వచ్ఛమైనది. అలాగే ధైర్యవంతురాలు కూడా. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా ‘గీతాంజలి ఎందుకలా ప్రవర్తిస్తోంది’ అంటూ దర్శకుడిని చాలాసార్లు అడిగిందట రష్మిక. దానికి సందీప్ రెడ్డి వంగా ఇది రణ్విజయ్ – గీతాంజలి కథ. వాళ్ల ప్రేమ, కుటుంబం, జీవితం, స్వభావం అలానే ఉంటాయి అని అన్నారట. హింస, బాధ ఉన్న ప్రపంచంలో శాంతి, నమ్మకం, ప్రశాంతతను గీతాంజలి (Rashmika) తీసుకువస్తుంది అని చెప్పారట.
భర్త, పిల్లలు సంతోషంగా ఉండాలంటూ గీతాంజలి భగవంతుడిని కోరుకుంటుంది. కుటుంబం కోసం ఒడుదొడుకులను తట్టుకుని నిలబడిన శిల గీతాంజలి. తమ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ధైర్యంగా నిలబడే ఎంతోమంది మహిళల్లాంటిదే ఈ గీతాంజలి కూడా అని రష్మిక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే విడుదలైన రోజు నుండే ఈ సినిమాకు భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రూ. 600 కోట్లకు దగ్గరలో వసూళ్లు ఉన్నాయి.