మేం లీకులు ఇస్తాం.. మీరు క్లారిటీలు అడగండి.. అప్పుడు మేం వాయిదా వేసి.. చెప్పాలని అనిపించినప్పుడు చెబుతాం. ఈ మాటలు అన్ని ఇప్పుడు బాగా యాప్ట్ అయ్యేవి ఎవరికి అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందనకే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ప్రేమబంధంలో ఉన్నారంటూ వార్తలొచ్చిన వీరిద్దరికీ కొన్ని రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్ అయింది అనే లీకులు వచ్చాయి. అతి తక్కువ మంది గెస్టులతో, ఇరు కుటుంబాలు కలసి వీరి ఎంగేజ్మెంట్‌ని చేశాయి అని అప్పుడు సమాచారం వచ్చింది. ఈ సమాచారం సన్నిహితుల నుండి బయటకు వచ్చింది.
అయితే, ఇప్పటివరకు ఆ ఎంగేజ్మెంట్‌కి సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాలేదు. ఎంత హైప్రొఫైల్ ఈవెంట్ అయినా ఎక్కడో దగ్గర నుండి ఫొటోలు లీక్ అయ్యేవి. కానీ ఈ విషయంలో రష్మిక నుండి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఎంగేజ్‌మెంట్ అయిందనే సమాచారం వచ్చింది. ఇద్దరి పీఆర్ టీమ్ కూడా చూఛాయగా చెప్పేసింది. కానీ అధికారికంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు రాలేదు. దీంతో ‘నిశ్చితార్థం అయింది అనే సమాచారం’ అని అంటున్నారు.
విజయ్, రష్మిక ఏదైనా సినిమా ఈవెంట్ కోసం బయటకు వస్తే అడిగి వివరాలు తెలుసుకుందాం అని మీడియా, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ అనుకున్న సమయం అయితే వచ్చేసింది. కానీ అడిగిన ప్రశ్నకు అయితే ఆన్సర్ రాలేదు. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక ఇటీవల మీడియా ముందుకు, ప్రేక్షకుల ముందుకు ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఎంగేజ్మెంట్ గురించి ఓ అభిమాని నుండి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె చాలా తెలివిగా ఆన్సర్ చెప్పింది. అయితే ఎందుకింకా దాపరికం అనేది మాత్రం అర్థం కావడం లేదు.
ఇంతకీ రష్మిక ఏమంది అనేది చెప్పలేదు కదా.. ‘విజయ్‌తో మీకు ఎంగేజ్మెంట్ జరిగిందా? దానిపై క్లారిటీ కావాలి’ అని అడిగితే.. ‘మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం. ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడే చేస్తాను’ అని చెప్పింది. అయితే పెళ్లి, ముందు జరిగిన అన్ని ఫంక్షన్లను కలిపి రష్మిక, విజయ్ ఓ ఓటీటీకి స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేశారు.. అందుకే ఈ దాపరికం అని చెబుతున్నారు.