మాస్ మహారాజ్ రవితేజ రెండు పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుందో విక్రమార్కుడు సినిమాలో మనం చూసాం. పోలీస్ దొంగ క్యారెక్టర్లో రవితేజ అదరగొట్టారు. ఇప్పుడు మూడు పాత్రలతో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రవితేజ “రాజా ది గ్రేట్” సినిమా చేస్తున్నారు. అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కానుంది. దీని తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ”టచ్ చేసి చూడు” సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీనువైట్లతో మూవీ మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ మూవీతో హిట్ ట్రాక్ లోకి రావాలని శ్రీను వైట్ల రెమ్యునరేషన్ సైతం తీసుకోకుండా కష్టపడుతున్నారు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారని వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ”అమర్ అక్బర్ అంథోని” అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు చెబుతున్నారు. సో టైటిల్ ని బట్టి చూస్తే రవితేజ ట్రిపుల్ రోల్స్ తో హంగామా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు.