రవిబాబు సినిమాలంటే ఆడియన్స్ కి కొంత నమ్మకం ఉంది. ఎందుకంటే అతని సినిమాల్లో ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది. దానిని ఇష్టపడే ఆడియన్స్ కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన సరైన హిట్ డెలివరీ చేయలేకపోయారు. ఇంకా చెప్పాలంటే రవిబాబు హిట్టు కొట్టి దశాబ్ద కాలం దాటేసింది. ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ అవి మినిమమ్ బడ్జెట్లో కేవలం ఓటీటీల కోసమే అన్నట్టు చేస్తున్నారు. అందులో భాగంగానే అనుకుంట ‘రేజర్’ అనే సినిమాని రూపొందించారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ పోషించిన సినిమా ఇది. ప్రమోషన్స్ ఏమీ చేయకుండా ఈరోజు చాలా సైలెంట్ గా ‘రేజర్’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:
కథ: హోమ్ మినిష్టర్ కనకరాజుకి(వీరన్న చౌదరి) సీఎం కుర్చీపై మోజు ఎక్కువ. ఎలాగైనా సీఎంతో(రామరాజు) రాజీనామా చేయించి సీఎం కుర్చీ ఎక్కాలని ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగా ఒక రోజు తన ఇద్దరు కొడుకులతో కలిసి సీఎం ఇంటికి వెళతాడు.కనకరాజు ప్రపోజల్ ని సీఎం తిరస్కరిస్తాడు. దీంతో కనకరాజు కొడుకు సీఎంని చంపేసి.. ఆ మర్డర్ ని ‘హార్ట్ ఎటాక్ వచ్చి పోయినట్టు’ చిత్రీకరిస్తాడు. అయితే అదే రోజు సీఎం ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ కెమెరాని రిపేర్ చేసేందుకు వెళ్లిన విష్ణుధర్..కి(తనీష్) కనకరాజు అండ్ సన్స్ సీఎంని మర్డర్ చేసిన ఫుటేజీ లభిస్తుంది. ఆ విషయాన్ని తన స్నేహితుడుకి షేర్ చేసుకుంటాడు విష్ణు.
అయితే విషయం తెలిసుకున్న కనకరాజు కొడుకులు విష్ణు కుటుంబాన్ని అలాగే అతని స్నేహితుడి కుటుంబాన్ని దారుణంగా హతమారుస్తారు. దీనికి ప్రత్యక్ష సాక్షి విష్ణు కూతురైన తేజు. ఆమె మీడియాకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. దీంతో ఆ పాపని కూడా చంపేయాలని కనకరాజు అండ్ సన్స్ ప్లాన్స్ వేస్తారు. అయితే వాటికి అడ్డుగోడగా నిలబడి పాపని కాపాడుతూ ఉంటాడు ఓ డాగ్ గ్రూమర్ రేజర్ అలియాస్ రుద్ర ప్రతాప్. అతనికి తేజుకి సంబంధం ఏంటి? అసలు రుద్ర ప్రతాప్ ఎవరు? అతని బ్యాక్ స్టోరీ ఏంటి? కనకరాజు భాగోతాన్ని బయటపెట్టి చివరికి ఆ పాపని ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: రవిబాబు ఈ సినిమాకి ఆల్ రౌండర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాకి మెయిన్ లీడ్ కూడా అతనే. ఫస్ట్ టైం అనుకుంట రవి బాబు ఓ సినిమాలో ఇన్ని ఫైట్ సీక్వెన్స్..లలో పాల్గొనడం. అతని కటౌట్ ని చూస్తే ఎంతమందినైనా చితక్కొట్టేస్తాడు అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. ఓకె అక్కడి వరకు కన్వెన్సింగ్. కానీ అతను ఛేజింగ్ సీక్వెన్సుల్లో పరిగెత్తడానికి చాలా కష్టపడ్డాడు. నటనలో కొత్తగా ప్రయత్నించింది ఏమీ లేదు. సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే లాగించేశాడు. తనీష్ ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించాడు. కథ మొత్తాన్ని నడిపించేది ఇతని పాత్రే. ‘ఇలాంటి రోల్స్ కి తనీష్ సరిపోతాడు’ అనే హెల్ప్ అయితే అతనికి ‘రేజర్’ సినిమా ద్వారా లభించొచ్చు.
పెద్ద సినిమాల్లో సైడ్ విలన్ గా, ప్యాడింగ్ ఆర్టిస్ట్ గా కనిపించే వీరన్న చౌదరికి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ గా చేసే ఛాన్స్ లభించింది. అతని లుక్ తో భయపెట్టాడు. కానీ రెగ్యులర్ టెంప్లేట్ విలన్లానే నటించాడు.సీరియల్ ఆర్టిస్ట్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీనా వాసు ఈ సినిమాలో రవిబాబుకి జోడీగా నటించింది. ఆమె పాత్రని ముగించిన విధానం ఎమోషనల్ గా అనిపిస్తుంది. సీనియర్ నటుడు బెనర్జీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ప్రగత్, గౌరవ్, ప్రణవి వంటి అప్ కమింగ్ ఆర్టిస్టులతో పాటు తేజు పాత్ర చేసిన పాప కూడా బాగా చేసింది.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రవిబాబు సినిమాలపై ఆడియన్స్ కి రెస్పెక్ట్, నమ్మకం ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో హిట్ సినిమాలు అందించిన ట్రాక్ రికార్డ్ అతనిది. కానీ కొంతకాలంగా నాన్ థియేట్రికల్ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికే అతను సినిమాలు తీస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒక ఫ్లాట్ లో లేదంటే ఒక ఇంట్లో సినిమాని చుట్టేస్తున్నాడు. ‘క్రష్’ ‘ఏనుగుతొండం ఘటికాచలం’ వంటి సినిమాలు అలాంటి ఫీలింగే ఇచ్చాయి. ‘రేజర్’ ట్రైలర్ చూసి రవిబాబు ఏదో కొత్తగా ట్రై చేసినట్టున్నాడు అని ఆడియన్స్ ఆశించారు.
కానీ అది వట్టి అపోహే అని మొదటి 15 నిమిషాలకే అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కటే సీన్ లూప్ లో రిపీట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ట్విస్టులు వంటివి ఏమీ ఉండవు. పైగా మితిమీరిన వయొలెన్స్ చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది.బహుశా ‘మార్కో’ సినిమా చూసి రవిబాబు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంతే.! పాటలు వంటివి లేకపోవడం మరో రిలీఫ్ ఇచ్చే అంశం. సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ చాలా సేపు కూర్చున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఫైట్ సీక్వెన్సులు అన్నీ ‘ఓవర్ ది టాప్’ అన్నట్టే ఉన్నాయి.
విశ్లేషణ: ‘రేజర్’ తో రవిబాబు మరోసారి డిజప్పాయింట్ చేశాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మితిమీరిన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథనం వంటివి.. టార్గెటెడ్ ఆడియన్స్ ని, రెగ్యులర్ మూవీ లవర్స్ ని కూడా ఆకట్టుకోవు అనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: ‘రేజర్’.. ఆడియన్స్ పై ప్రెజర్
రేటింగ్: 1.5/5