థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన మలయాళం ఇండస్ట్రీ నుండి జనవరిలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “రేఖాచిత్రం”(Rekhachitram). ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై సోషల్ మీడియా ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ సినిమా సంగతేంటో చూద్దాం..!!
కథ: వయసులో ఉన్నప్పుడు తన స్నేహితుడితో కలిసి ఓ అమ్మాయి మృతదేహాన్ని ఇద్దరు స్నేహితులతో కలిసి ఇక్కడే పాతి పెట్టేశామని రాజేంద్రన్ (సిద్ధిఖీ) తన మరణ వాంగ్మూలంలో పేర్కొంటూ షూట్ చేసుకొని చనిపోతాడు. ఆ కేస్ ను డీల్ చేయడం మొదలుపెడతాడు సిఐ వివేక్ గోపినాథ్ (ఆసిఫ్ అలీ).
ఆ మృతదేహం ఎవరిది అని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన వివేక్ కి ఆ మృతదేహం రేఖ (అనశ్వర రాజన్) అనే అమ్మాయిదని తెలుస్తుంది. అసలు రేఖ ఎవరు? ఎందుకని రాజేంద్రన్ & ఫ్రెండ్స్ ఆమెను చంపుతారు? ఆమె మృతదేహం ద్వారా వివేక్ తెలుసుకున్న విషయాలు ఏంటి? అనేది “రేఖాచిత్రం” (Rekhachitram) కథాంశం.
నటీనటుల పనితీరు: ఆసిఫ్ అలీ ఈ తరహా పోలీస్ పాత్రలు ఇప్పటికే పదుల సంఖ్యలో చేసి ఉంటాడు. అదే తరహా సిన్సియారిటీ & కన్విక్షన్ ఉన్న సి.ఐ వివేక్ పాత్రలో మరోసారి అద్భుతంగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేటింగ్ సీన్స్ లో అతడి కళ్ళల్లో కనిపించిన హావభావాలు కథాగమనంలో చాలా కీలకపాత్ర పోషించింది. అనశ్వర రాజన్ కి సినిమాలో ఉన్న సన్నివేశాలు తక్కవే అయినప్పటికీ.. ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అదిరింది. ఆమె పాత్ర చుట్టూ అల్లిన కథను ఆమె క్యారీ చేసిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది.
అలాగే.. మనోజ్ కె.జయన్ ఓ కీలకపాత్రలో మెప్పించిన విధానం సినిమాకి మరింత హెల్ప్ అయ్యింది. అన్నిటికీ మించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మమ్ముట్టిని సినిమాలో నటింపజేసిన విధానం ప్రశంసనీయం. ఎక్కువ క్లోజప్స్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్ లో మమ్ముట్టి యంగ్ లుక్ ను రీక్రియేట్ చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్స్ లో కథనం గ్రిప్పింగ్ గా ఉండి, ట్విస్టులు ఊహించని విధంగా ఉన్నప్పుడు ప్రేక్షకులు కచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవుతారు. “రేఖాచిత్రం”లో సదరు అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా.. స్క్రీన్ ప్లేకి అందరూ షాక్ అవుతారు. ఎక్కడా డిస్ట్రబింగ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా, కేవలం కథా బలంతో సినిమాని నడిపించిన విధానం “రేఖాచిత్రం” సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్.
దర్శకుడు జోసెఫ్, కథకుడు రాము సునీల్ నిజజీవిత పాత్రలను, సందర్భాలను ఆధారంగా చేసుకొని కల్పిత కథనంతో థ్రిల్లర్ ను రాసుకున్న విధానం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. మలయాళ ఆడియన్స్ కు కచ్చితంగా ఈ చిత్రం చాలా పాత జ్ఞాపకాలు నెమరువేసుకునే అవకాశం కల్పించి ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కు సదరు సినిమాల గురించి అవగాహన ఉంటే పర్లేదు కానీ.. లేకపోతే మాత్రం కనెక్ట్ అవ్వడానికి కాస్త ఇబ్బందిపడతారు. సంగీతం, ఎడిటింగ్, లైటింగ్, డి.ఐ, సీజీ వర్క్ వంటి అంశాలన్నీ సమపాళ్లలో సింక్ అయ్యాయి. ఆ కారణంగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
విశ్లేషణ: ఒక పూర్తిస్థాయి కన్విక్షన్ తో నడిచే థ్రిల్లర్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. “రేఖాచిత్రం” అలాంటి సినిమానే. ఆసిఫ్ అలీ, అనశ్వర నటన, జోఫిన్ దర్శకత్వ ప్రతిభ, ముజీబ్ నేపథ్య సంగీతం వంటి అంశాలన్నీ సమపాళ్లలో కలగలిసి “రేఖాచిత్రం”ను మస్ట్ వాచ్ థ్రిల్లర్ గా మార్చాయి.
ఫోకస్ పాయింట్: మస్ట్ వాచ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!
రేటింగ్: 3/5