దాబాకే ఓటేసిన మహాతల్లి

  • November 18, 2016 / 09:46 AM IST

డబ్బులు ఉన్నాయని, మన రేంజ్ హై రేంజ్ అని రెస్టారెంట్ కి వెళ్తే తిప్పలు తప్పవని “మహాతల్లి” యూత్ ని హెచ్చరించింది. అలంకరణ శాలలో పార్లర్ల వారిపై పంచ్ వేసినంత ఘాటుగా కాకుండా కాస్త మసాలా తగ్గించి ఫన్ బిర్యాని వడ్డించింది. స్టయిలిష్, గార్నిష్ అంటూ కోటింగ్ ఫుడ్ పెట్టి .. కోట్లు వేసుకుని టిప్పులు పట్టే వారికంటే తక్కువ ఖర్చుతో ప్లేట్ నిండా ఫుడ్ పెట్టే దాబా వాళ్లే బెటర్ అని తేల్చి చెప్పేసింది. బటర్ చికెన్ మసాలా డిష్ లా ఉండే “రెస్టారెంట్ వర్సెస్ దాబా ” లో వేసిన స్పైసెస్, హెర్బ్స్ ఏంటో తెలుసుకుందాం.

తేడా ఏమిటంటే ..
మనకి ఏమి కావాలో అడగడం నుంచే రెస్టారెంట్, దాబాకి తేడా ఏమిటో తెలిపింది మహాతల్లి. దాబా లో అయితే ఎలా పిలిచినా పలుకుతారు. రెస్టారెంట్లో అయితే ఆకలి వేస్తున్నా బయటికి తెలియనీయకుండా .. కోపం వస్తున్నా కనబడకుండా మాటలకు ఇంగ్లీష్ జామ్ రాసి పిలిస్తే గౌరవిస్తారు. మన టేబుల్ దగ్గరకు వస్తారు. వచ్చిన స్టీవార్డ్ మెనూ కార్డు చేతిలో పెట్టి .. అందులో చికెన్ కర్రీకి ఏ పేరు పెట్టారో తెలుసుకోమని పజిల్ వేస్తారు. అదే దాబా లో అయితే మెనూ కార్డు చదివే కష్టం కూడా లేకుండా అక్కడ దొరికే టేస్టీ రెసిపీల లిస్ట్ అంతా స్కూల్ పిల్లవాడు లెక్కలు అప్పచెప్పినట్లు చెబుతారు.

సరే మొదటి పజిల్ ని విప్పి ఆర్డర్ టేబుల్ వద్దకు వచ్చినా ఆనందంగా తింటామా అంటే అది లేదు. సైన్స్ ల్యాబ్ లో జీవాల అడ్డుకోత నిలువు కోత చేస్తున్నట్లు కోసుకొని తినాలి. పైగా నమిలే శబ్ధం నాలుకకి కూడా తెలియ కూడదు. అదే దాబా లో అయితే రంగు, రుచి, వెచ్చదనం ఆస్వాదిస్తూ.. కడుపు నిండే వరకు గుటకలు వేయొచ్చు.

మిగిలిన ఫుడ్ ఎంత ఎక్కువగా ఉన్న రెస్టారెంట్లో ప్యాక్ చేయమని అడగలేం. కాస్త కూర మిగిలి పోయిన దాబాలో చక్కగా ప్యాక్ చేసి ఇస్తారు. ఇక బిల్ విషయంలో అందరికి తెలిసిందే. రెస్టారెంట్ లో సలాడ్ తినే ఖర్చుతో దాబాలో రొమాలి రోటి విత్ ఎగ్ కర్రీ లాగించేయవచ్చు.

ఏ టాపిక్ తీసుకున్నా దోశలాగా ఒక వైపే కాల్చకుండా .. చపాతీలా రెండువైపులా రీసర్చ్ చేసి రీల్ మయం చేసే జాహ్నవి బృందం .. ఈ చిత్రానికి కూడా అంతే శ్రమించింది. చిన్న తేడాను కూడా స్పష్టంగా చూపించింది.

ఈ చిత్రం అమ్మాయిలకంటే అబ్బాయిలకే ఎక్కువగా ఉపయోగ పడుతుంది. ఎందుకంటే లంచ్ అనగానే రెస్టారెంట్ కి వెళదామని పేచీ పెట్టే గర్ల్ ఫ్రెండ్ కి ఈ వీడియో చూపించి సదరు హీరో పర్స్ లోని లక్ష్మీ దేవిని సేవ్ చేసుకుంటాడు.

ఫైనల్ గా డిజర్ట్ లాంటి మాట ఏమిటంటే వైరల్లీ సౌత్ నుంచి మనసుకు ఉపయోగ పడే మరో టేస్టీ షార్ట్ ఫిల్మ్ “రెస్టారెంట్ వర్సెస్ దాబా”.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus