దేశంలోని యువ గాయకులు సొంతం చేసుకోవాలని కలలు కనే ఇండియన్ ఐడల్ టైటిల్ ని రేవంత్ గెలుచుకున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ‘మనోహరి’.. ‘దమ్ము’లో ‘రూలర్ (మూవీ వెర్షన్)’ సహా పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడి సత్తా చాటిన రేవంత్ మరోసారి తన గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రముఖ టీవీ ఛానల్ వారు నిర్వహించే పోటీలో రేవంత్ విజేతగా నిలిచినట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ప్రకటించారు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్.. హైదరాబాద్‌లో గాయకుడిగా స్థిరపడ్డారు. ఈ పోటీలో పంజాబ్‌కు చెందిన ఖుదా బక్ష్ రెండో స్థానంలో నిలవగా.. మరో తెలుగు కుర్రాడు పీవీఎన్‌ఎస్ రోహిత్ మూడో స్థానం సాధించారు.
ఇండియన్ ఐడల్ బిరుదుతోపాటు రూ.25లక్షల నగదు బహుమతిని రేవంత్ దక్కించుకున్నారు. సోని మ్యూజిక్ సంస్థతో పాటల ఒప్పందాన్ని కూడా గెలుచుకున్నారు. మహీంద్ర కేయూవీ100 వాహనం కూడా కానుకగా దక్కింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘‘ నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఇంటికి వెళ్లి నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విజయంపై సంబరాలు చేసుకుంటాను.’’ అని రేవంత్ అన్నారు. ఇండియన్ ఐడల్ టైటిల్‌ను గెలుచుకున్న రెండో తెలుగు సింగర్ రేవంత్. గతంలో గాయకుడు శ్రీరామ చంద్ర ఈ పోటీల్లో విజేతగా నిలిచారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.