రాంగోపాల్ వర్మ ఒక మూడేళ్ళ క్రితం తన శిష్యులతో కలిసి తెరకెక్కించిన వెబ్ ఫిలిమ్ ను “D కంపెనీ” పేరుతో కొత్తగా లాంచ్ చేసిన ఒటీటీలో విడుదల చేశారు. నిజానికి ఇది వెబ్ సిరీస్, మరిన్ని భాగాలు విడుదల కావాల్సి ఉంది. దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ స్పార్క్ ఒటీటీలో స్ట్రీమ్ అవుతోంది. వర్మ ఈసారి ఎలాంటి ఝలక్ ఇచ్చాడో చూద్దాం..!!
కథ: పోలీస్ కానిస్టేబుల్ కొడుకైన దావూద్ (అశ్వత్ కాంత్) ఒక వీధి రౌడీ స్థాయి నుంచి ముంబై నగరం భయపడే డాన్ గా ఎలా ఎదిగాడు? అందుకు అతడు ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు? అప్పటివరకూ డాన్ లుగా ఉన్నవారిని తన అనుచరులుగా ఎలా మార్చుకున్నాడు? గూండాగిరీని తన తెలివితేటలతో ఎలా కంట్రోల్ చేశాడు? వంటి అంశాలకు చిత్రరూపమే ఈ చిత్రం.
నటీనటుల పనితీరు: బేసిగ్గా వర్మ సినిమాల్లో నటీనటులందరూ బాగానే చేస్తారు. అది ఆయన కెమెరా ఫ్రేమింగ్స్ పరంగా తీసుకొనే జాగ్రత్తల వల్ల అయ్యుండొచ్చు, లేదా ఎడిటింగ్ వల్ల అయ్యుండొచ్చు. కానీ.. ప్రతి నటుడు/నటి తమ బెస్ట్ ఇస్తారు. ఈ సినిమాలో పాత్రధారులు నైనా గంగూలీ, ఇర్రా మోర్ తప్ప మరెవ్వరూ మనకి తెలియదు. అందరూ దాదాపు హిందీ ఆర్టిస్టులే. అందువల్ల వారి నటన మనకి అర్ధం కాకపోయినా, వర్మ ఇచ్చే వాయిస్ ఓవర్ కి ఆడాప్ట్ అయిపోతారు.
సాంకేతికవర్గం పనితీరు: వర్మ కర్ణకఠోరమైన గొంతుతో పాడిన పాటతో మొదలయ్యే సినిమా ఇది. మోడలే అంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, మిగతాది ఏమాత్రం సోసోగా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. “D కంపెనీ” విషయంలో జరిగింది కూడా అదే. వర్మ తీసిన అనేక పిచ్చి ప్రయోగాలతో పోల్చి చూస్తే ఈ సినిమా పర్లేదు. వర్మ వాయిస్ ఓవర్ కథను, కథనాన్ని, నటీనటుల పనితనాన్ని డామినేట్ చేస్తున్నప్పటికీ.. డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే ఫీల్ రాకుండా చేసింది. అందువల్ల వర్మ వాయిస్ ఈ సినిమాకి ప్లస్ & మైనస్ కూడా. ఓవరాల్ గా వర్మ ఈ సినిమాలో కొత్తగా తీసిందేమీ లేదు.
ఈ తరహా సినిమాలు వర్మ ఇంతకంటే చాలా బాగా ప్రెజంట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. 26/11 ముంబై ఎటాక్స్, రక్తచరిత్ర వంటి వర్మ సినిమాలు చూశాక “D కంపెనీ” అతి సాధారణంగా కనిపిస్తుంది. వాయిస్ ఓవర్ మినహా సినిమాలో ఎక్కడా వర్మ మార్క్ కనిపించడపోవడం మాత్రం గమనార్హం. మిగతా టెక్నికల్ విషయాల గురించి చర్చించుకోవాల్సిందేమీ లేదు. అయితే.. మల్హార్ భట్ జోషి కెమెరా పనితనం కంటే లైటింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.
విశ్లేషణ: ఒక సినిమా ఫస్టాఫ్ మాత్రమే చూసి రివ్యూ ఎలా ఇవ్వలేమో, “D కంపెనీ”కి కూడా అంతే. అయితే.. వర్మ ఈ చిత్రాన్ని సిరీస్ అని కాకుండా సినిమా అని పబ్లిసిటీ చేసి విడుదల చేసిన ఏకైక కారణంగా ఈ సమీక్ష రాయడం జరిగిందే తప్పితే.. సినిమాగా కన్సిడర్ చేసి మాత్రం కాదు. మరి వర్మ కనీసం స్పార్క్ యాప్ సర్వైవల్ కోసమైనా కాస్త మంచి కంటెంట్ అందిస్తాడని ఆశిద్దాం!
రేటింగ్: 1.5/5