‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండీ ‘ లక్ష్మీ పార్వతి’ ‘చంద్రబాబు’ ల ఫస్ట్ లుక్స్ విడుదల చేసిన వర్మ..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేను నిజమైన ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీస్తున్నానంటూ… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో కౌంటర్లు.. కామెంట్లు పెడుతున్నాడు. తాజాగా లక్ష్మి పార్వతి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసాడు.

‘లక్ష్మీ పార్వతి’ ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసాడు వర్మ. ఈమె మరెవరో కాదు…. కన్నడ నటి యజ్ఞా శెట్టి. లక్ష్మీ పార్వతి … ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించి రెండు పాటలను కూడా విడుదల చేసాడు. ఇక తాజా ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసే పనిలో పడ్డాడు. అయితే లక్ష్మీ పార్వతి గా కనిపిస్తున్న.. ఈ యజ్ఞా శెట్టి అంతగా సెట్ అయినట్లు కనిపించడం లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే వర్మ స్క్రీన్ పై ఈమెను ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంది.

అయితే ‘లక్ష్మీ పార్వతి’ తో పాటు ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసాడు. బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించిన శ్రీ తేజ్ ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో చంద్రబాబు పాత్ర చేయడం విశేషం. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటిలో దేవినేని నెహ్రు పాత్రలో కనిపించాడు.ఇక మరోసారి వర్మ చిత్రంలో నటిస్తున్నాడు. నిజ జీవితంలో రాజకీయ నాయకుల పాత్రల్లో శ్రీ తేజ్ బాగానే సెట్ అవుతుండడం విశేషం. ఇక ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడిగా ఎలా నటించబోతున్నాడో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus