ఆర్ ఎక్స్ 100

ట్రైలర్ విడుదల వరకూ అసలు ఇలాంటి సినిమా ఒకటుందని కూడా ఎవరికీ తెలియదు, ట్రైలర్ లో కాస్త సహజత్వం, శృంగారం కాస్త ఎక్కువగా ఉండడంతో యూట్యూబ్ & సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యేసరికి సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ ని కంటిన్యూ చేస్తూ “ఇది రొటీన్ సినిమా కాదు, అలాంటి సినిమాలు కోరుకొనేవారు దయచేసి థియేటర్ కి రాకండి, ఒకవేళ సినిమా ఫ్లాపైతే నేను మా ఊరెళ్ళిపోయి పొలం పనులు చూసుకొంటాను” అంటూ డైరెక్టర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇంకాస్త వైరల్ అయ్యింది. మరి దర్శకుడు హిట్ కొట్టాడా లేక ఊరికి వెళ్లిపోవడానికి టికెట్ తీసుకోవాలా అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!

కథ : ఆత్రేయపురం అనే గ్రామంలో ఉరిపెద్ద (రావు రమేష్) మరియు డాడీ (రాంకీ)లకు అండగా నిలుస్తూ వారి రాజకీయ వ్యవహారాల్లో సహాయకుడిగా ఉంటాడు శివ (కార్తికేయ). అదే ఊర్లోని థియేటర్ చూసుకొనే శివ జీవితంలో డాడీ, థియేటర్, ఊరు తప్ప వేరే ధ్యాస ఉండదు. అలాంటి శివ జీవితంలో ఎంటరవుతుంది ఇందు (పాయల్ రాజ్ పుత్). ప్రెసిడెంట్ కుమార్తె అయిన ఇందు బెంగుళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సెలవులకి ఆత్రేయపురం వస్తుంది.

తొలిచూపులోనే షర్ట్ విప్పి డ్యాన్స్ చేస్తున్న శివను ప్రేమించిన నందు ఏమాత్రం లేట్ చేయకుండా అతడికి ప్రపోజ్ చేసి ప్రేమ వ్యవహారాన్ని పడక దాకా లాగుతుంది. ఉన్నట్లుండి నందుకి పెళ్లి చేసి అమెరికా పంపించేస్తాడు తండ్రి. తన ప్రేమికురాలి కోసం ఆమె ఇంటి దగ్గరే మూడేళ్లపాటు వెయిట్ చేస్తుంటాడు శివ. నందు అమెరికా నుంచి వస్తుంది కానీ.. శివను కనీసం చూడడానికి కూడా ఇష్టపడదు. శివను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నందు అతడిని చూడ్డానికి ఎందుకు ఇష్టపడదు? మరొకరి భార్య కూడా అయిపోయిన తన మాజీ ప్రేయసి నందును శివ తిరిగి దక్కించుకోగలిగాడా? లేదా? అనేది “ఆర్ ఎక్స్ 100” కథాంశం.

నటీనటుల పనితీరు : ముఖంలో రౌద్రం అనే భావం వ్యక్తపరచడానికీ, ఏదో చిరాగ్గా ఉన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ పెట్టడానికి చాలా తేడా ఉంది. ఈ విషయంలో సరైన క్లారిటీ లేని కార్తికేయ సినిమా మొత్తం సీరియస్ గా ఉంటున్నాను అని చూపించుకోవడానికి పెట్టిన హావభావాలు ప్రేక్షకుడ్ని కాస్త ఇబ్బందిపెడతాయి. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా ఒక్క రొమాన్స్ సీన్స్ లో తప్ప పర్వాలేదనిపించుకొన్నాడు కార్తికేయ. పాయల్ రాజ్ పుత్ పాత్ర కొందరికి కనెక్ట్ అవుతుంది, కొందరికి అవ్వదు. అయితే.. అమ్మడు అందాల ఆరబోత విషయంలో చూపని మొహమాటం, రోమాటిక్ సీన్స్ లో పడని సిగ్గు కాస్త వైల్డ్ రొమాన్స్ ఇష్టపడే యువత మరియు ఒక సెక్షన్ ఆడియన్స్ కు మాత్రం నచ్చుతుంది. కాకపోతే పాయల్ క్యారెక్టరైజేషన్ “గుండెల్లో గోదావరి” చిత్రంలో తాప్సీ పాత్రను తలపించడం గమనార్హం.

రావు రమేష్ పోషించిన తండ్రి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ లో కూతురుతో మాట్లాడే సీన్ లో ఆయన నటన, డైలాగులు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. తమిళ నటుడు రాంకీ ఈ చిత్రంలో పోషించిన పెద్ద మనిషి తరహా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ, తన స్క్రీన్ ప్రెజన్స్ తో “డాడీ” క్యారెక్టర్ ను జనాలకి చేరువ చేశాడు రాంకీ.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు అజయ్ భూపతి మేవరిక్ డైరెక్టర్ వర్మ శిష్యుడు కావడం వల్లనో లేక సినిమాటోగ్రాఫర్ మీద కూడా వర్మ ప్రభావం ఎక్కువగా ఉందో తెలియదు కానీ.. చాలా సన్నివేశాల్లో పెట్టిన కెమెరా యాంగిల్స్, బ్లాక్స్ & ఫ్రేమ్స్ వర్మ సినిమాలను తలపిస్తాయి. సైలెన్సర్ కి కెమెరా పెట్టడం, మెట్ల గుండా కెమెరాను పైకి కిందకి తిప్పడం వంటివి వర్మ స్టైల్ ను తలపిస్తాయి. అయితే.. ఈ తరహా సినిమాకి కావాల్సిన రియలిస్టిక్ ఫీల్ ను మాత్రం తన కెమెరా వర్క్ తో తీసుకురాలేకపోయాడు రామ్. టింట్ & డి.ఐ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. చైతన్ భరద్వాజ్ సంగీత సారధ్యంలో రూపొందిన 7 పాటల్లో “పిల్ల రా..” అనే పాట బాగుంది. అయితే.. ఫస్టాఫ్ లోనే అయిదు పాటలు వాడేయడంతో సెకండాఫ్ కి ఒక ఐటెమ్ సాంగ్ తప్ప మరో పాట మిగల్లేదు. ఫస్టాఫ్ లో స్టోరీ మొత్తం పాటలతోనే ముందుకు సాగడం వలన ఇది మ్యూజికల్ లవ్ స్టోరీనా, దర్శకుడు ప్రమోట్ చేసినట్లు ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీనా అనే విషయంలో ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ నెలకొనడం ఖాయం.

వర్మ వద్ద పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన అజయ్ భూపతి ఈ సినిమా కథను శివ అనే వ్యక్తి నిజజీవితం నుంచి ఇన్స్ ఫైర్ అయ్యి రాసుకోవడం విశేషం. 2014లో మరణించిన ఆ వ్యక్తి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలను బేస్ చేసుకొని ఈ కథ రాసుకొన్నాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. ఒక్క హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తప్ప సినిమాలో ఎక్కడా కొత్తదనం కానీ డిఫరెంట్ డీలింగ్ కానీ కనిపించదు. ముఖ్యంగా ఈ తరహా సినిమాలకు కావాల్సిన ఎమోషన్ అనేది ఎక్కడా కనిపించదు, అనిపించదు.

సరసమైన శృంగారానికి, శ్రుతిమించిన వ్యవహారానికి చాలా తేడా ఉంటుంది. అలాగే కామంతో కొట్టుమిట్టాడుతున్న కన్యకామణి కోరిక తీర్చుకోవడానికి ఇచ్చే మొరటు ముద్దులో కోరిక కనిపిస్తే, మనసులో స్వచ్చమైన ప్రేమ తొణికిసలాడుతున్న యువకుడు ఇచ్చే ముద్దులో ప్రణయ భావం వ్యక్తీకరించబడాలి. కానీ.. ఆ తేడాకి దర్శకుడు కానీ నటీనటులు కానీ పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా కనిపించదు. ముద్దు అనేది ముద్దుగా ఉండాలి కానీ.. 70 ఎం.ఎం స్క్రీన్ పై చూస్తున్న ప్రేక్షకుడు ఇబ్బందిపడకూడదు. రొమాన్స్ లో పెయిన్ ఉండొచ్చు కానీ.. ఆ పెయిన్ (బాధను) రమిస్తున్న ప్రేమికులు ఫీలవ్వాలి కానీ.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కాదు అనే బేసిక్ లాజిక్ ను మర్చిపోయారు.

“మా ప్రేమకి ఈ బండే సాక్ష్యం” అని హీరో చెప్పే ఒక్క డైలాగ్ తప్ప సినిమా మొత్తం చూశాక ఈ సినిమాకి “ఆర్ ఎక్స్ 100” అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయం ఎవరికీ అర్ధం కాదు. . అయినా.. హార్డ్ హిట్టింగ్ సినిమా అంటే హీరోకి లెక్కలేనంత యాటిట్యూడ్, పట్టరానంత కోపం, చెప్పుకోలేనంత బాధ ఉంటే సరిపోదు.. ఆ మూడింటికి సరైన రీజన్ ఉండాలి, డీలింగ్ ఉండాలి. “ఆర్ ఎక్స్ 100” సినిమాలో మిస్ అయ్యింది అదే. అమ్మాయిల్ని అసహ్యించుకొనే, వారి మీద విపరీతమైన కోపం పెంచుకొన్న కొందరు అబ్బాయిలకి మినహా ఈ సినిమా ఎవరికీ కనెక్ట్ అవ్వదు. ముఖ్యంగా.. క్లైమాక్స్ రొటీన్ కి భిన్నంగా ఉండడం పక్కన పెడితే అసలు లాజిక్ ఏంటో, ఎమోషన్ ఏంటో చాలా మంది సగటు ప్రేక్షకులకి అర్ధం కాదు.

విశ్లేషణ : నిజానికి “ఆర్ ఎక్స్ 100” ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ. సరిగ్గా డీల్ చేసి ఉంటే “అనంతపురం 1980” కంటే పెద్ద హిట్ అవ్వడానికి కావాల్సిన అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి. కానీ.. ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కడా లేవు. హీరోయిన్ పాత్ర ట్విస్ట్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చి షేక్ చేయాలి, హీరో పాత్రలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యి.. అతడి ప్రేమలోని బాధను, కోపాన్ని ఫీలవ్వాలి, హీరోయిన్ తండ్రి పాత్రలోని నిస్సహాయతను తమ బలహీనతగా ఫీలవ్వాలి.

కానీ.. సినిమాలో ఆ కనెక్టివిటీ కానీ ఎమోషన్ కానీ ఎక్కడా కనిపించదు. అందుకే ఈ చిత్రం అందరు అనుకొంటున్నట్లుగా “అర్జున్ రెడ్డి” తరహాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కానీ.. ఆడియన్స్ ను ఎమోషనల్ గా సినిమాలో ఇన్వల్వ్ చేయడం కానీ జరగదు. అందువల్ల హీరోయిన్ అందాలను, మొరటు శృంగార సన్నివేశాలను ఆస్వాదించడం కోసం, కొన్ని ఫైట్ సీన్స్ కోసం “ఆర్ ఎక్స్ 100″ను చూడాలే తప్ప ప్రత్యేకించి వేరే కారణం అయితే కనిపించదు.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus