మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ (Mass Jathara) తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రవితేజ కెరీర్లో 75వ సినిమా కావడంతో ‘మాస్ జాతర’ ప్రత్యేకతను సంతరించుకుంది. టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ఈ సినిమాపై రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు అని భావించి వాయిదా వేశారు. మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకుని నవంబర్ 1న విడుదల కానుంది ‘మాస్ జాతర’ (Mass Jathara). అక్టోబర్ 31న ప్రీమియర్స్ కూడా వేయనున్నారు. అయితే ఆల్రెడీ నాగవంశీ ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకు స్పెషల్ గా షో వేసి చూపించారట. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు ఉంటుందట. ఫస్ట్ హాఫ్ లో విలన్ ట్రాక్ తో సినిమా మొదలవుతుందట. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయట. అటు తర్వాత హీరో ఎంట్రీ బాగా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ఆ వెంటనే వచ్చే కామెడీ, లవ్ ట్రాక్ అన్నీ ఎంటర్టైన్ చేస్తాయట. ఇంటర్వెల్ ఎపిసోడ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా ఓ షాకింగ్ ట్విస్ట్ పెట్టారట. అది సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది అంటున్నారు.
ఇక సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ … ‘సూపర్ డూపర్ హిట్ సాంగ్’ పాట అన్నీ మంచి హై ఇస్తాయట. రవితేజ (Ravi Teja) పాత సినిమాల రిఫరెన్స్..లను దర్శకుడు బాగా వాడినట్టు చెబుతున్నారు. అలాగే అతను మొదటి సినిమా తీసిన ఫీలింగ్ కలిగించదట. మొత్తానికి రవితేజ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా.. మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ‘మాస్ జాతర’ (Mass Jathara) ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.. ప్రీమియర్స్ తో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో..!