‘ఏమాయ చేసావే’ వంటి క్లాసిక్ హిట్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఏమాయ చేసావే’ తర్వాత చైతూ-రెహమాన్-గౌతమ్ మీనన్ కలయికలో వస్తున్న ఈ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంజిమ మోహన్ హీరోయిన్. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ అందించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూద్దామా!
కథ : రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే కుర్రాడు. ఓ సందర్భంలో తన చెల్లెలి స్నేహితురాలు లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఓ కోర్సు చేయడం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటం తెలిసి సంతోషపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్ కు మంచి పరిచయం ఏర్పడుతుంది. కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్నానని రజినీకాంత్ చెప్పగా లీలా కూడా బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా వాళ్ల బైక్ కు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇంతకీ లీలా సత్యమూర్తి ఎవరు? ఈ యాక్సిడెంట్ వెనకున్న అసలు కథ ఏంటి? లీలా వలన రజినీకాంత్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు : అక్కినేని నాగచైతన్య నటుడిగా మరింత మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు. లవ్, రొమాంటిక్ క్యారెక్టర్లలో చైతూ బాగా చేస్తాడని విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మరోసారి తన లవర్ బాయ్ క్యారెక్టర్ లో అలరించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా లైఫ్ ఎంజాయ్ చేసే కుర్రోడిగా నటిస్తే, సెకండ్ హాఫ్ లో మాస్ హీరోగా మారిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేసాడు. తనలోని యాక్షన్ ఇమేజ్ ను కూడా చూపించాడు. ఇక హీరోయిన్ మంజిమ మోహన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్, గ్లామర్ పరంగా బాగా ప్లస్ అయ్యింది. తన నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకుంది. చైతూ-మంజిమల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక చైతూ ఫ్రెండ్ గా నటించిన సతీష్ కృష్ణన్ మంచి నటనను కనబరిచాడు. విలన్ గా బాబా సెహగల్ పర్వాలేదనిపించాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో కొనసాగిన, సెకండ్ హాఫ్ లో యాక్షన్ థ్రిల్లర్ గా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో వెంట వెంటనే పాటలు రావడం కాస్త బోర్ కొడతాయి. విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేకపోవడం కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు. కానీ మొత్తంగా చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.
సాంకేతికవర్గం పనితీరు : ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు బాగున్నాయి. స్క్రీన్ పై చూస్తుంటే ఇంకా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. డాన్‌మాక్ ఆర్థర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను డీల్ చేసిన గౌతమ్ మీనన్ మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సింపుల్ స్టొరీ లైన్ కు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లను బాగా డిజైన్ చేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్, రొమాంటిక్ స్క్రీన్ ప్లేతో కొనసాగితే సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా డిజైన్ చేసారు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఎడిటింగ్ పనితీరు బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ : లవ్, రొమాంటిక్, యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తానికి చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు.
రేటింగ్ : 3.25/5