బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి తప్పని రిలీజ్ కష్టాలు

హౌస్ ఫుల్ కావాల్సిన థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. తెరపై బొమ్మ పడకపోవడంతో విజిల్స్.. చప్పట్లు లేక బోసి పోయాయి. ప్రతి కార్యానికి పంచభూతాలు “సాక్ష్యం”గా ఉంటాయనే థీమ్ తో తెరకెక్కిన “సాక్ష్యం” సినిమా రిలీజ్ కి పంచభూతాలు సహాయ పడినా… ఆర్ధిక కష్టాలు అడ్డు తగిలాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామ నిర్మించిన సినిమా ‘సాక్ష్యం’. ట్రైలర్ తో ఆసక్తికలిగించిన ఈ చిత్రం ఈరోజు మార్నింగ్ షో తో మొదలుకావాలి. అయితే థియేటర్లకు ఇంకా డిజిటల్ కీ అందకపోవడంతో కొన్నిచోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ ఐమాక్స్‌ లో మార్నింగ్ 8.45 షో క్యాన్సిల్ అయ్యింది. ఆన్‌లైన్ బుకింగ్‌ చేసుకున్న ప్రేక్షకులకు పదిరోజుల్లో మీ టికెట్ డబ్బులు అకౌంట్ లోకి రిటర్న్ వస్తాయని సందేశంలో పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్‌లో మాత్ర‌మే కాదు…

తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో మార్నింగ్ షోలు పడటం లేదని సమాచారం. ఏ థియేటర్‌కీ ఇంకా ‘సాక్ష్యం’ ప్రింట్ అందలేదు. సాధారణంగా ఒక్క రోజు ముందే థియేటర్ జనాలకు డిజిటల్ ప్రింట్ వెళ్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ‘సాక్ష్యం’ ప్రింట్ కోసం గురువారం రాత్రి నుంచి థియేటర్లలో సిబ్బంది ఎదురుచూసారు. నిన్న సాయంత్రమే మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందాయట. తరవాత తెల్లవారుజామున మూడింటికి ప్రింట్ మీ వద్దకు చేరుతుందని సమాచారం వచ్చిందట. ఇంకా థియేటర్లకు ప్రింట్స్ అయితే చేరలేదు. ఎలాగైనా మధ్యాహ్నం షోలు పడేలా తీవ్ర కృషి చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus