మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటితో పదేళ్లు పూర్తి కావస్తోంది. అతని మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitam) 2014 నవంబర్ 14న రిలీజ్ అయ్యింది. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (A. S. Ravi Kumar Chowdary) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా (Regina Cassandra) హీరోయిన్ గా నటించింది. ‘గీతా ఆర్ట్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ (Bunny Vasu) , హర్షిత్ రెడ్డి..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతంలో రూపొందిన పాటలు, రఘుబాబు (Raghu Babu)..ప్రభాస్ శీను (Prabhas Sreenu) ..ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాగా ‘రేయ్’ (Rey) అనే సినిమా రావాలి. వైవీఎస్ చౌదరి(Y. V. S. Chowdary) దీనికి దర్శకుడు. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల డిలే అయ్యి సాయి దారం తేజ్ రెండో సినిమాగా రిలీజ్ అయ్యింది. అటు తర్వాత వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) ‘సుప్రీమ్’ (Supreme) సినిమాలు కూడా ఘన విజయం సాధించి తేజుకి మంచి మార్కెట్ ఏర్పడేలా చేశాయి.
ఈ 10 ఏళ్లలో తేజు చాలా చూశాడు. వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘చిత్రలహరి’ (Chitralahari) తో కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన ‘ప్రతిరోజూ పండగే’ (Prati Roju Pandage)‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) వంటి సినిమాలు ఇతని మార్కెట్ ను పెంచాయి. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఇతనికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. కోలుకోవడానికి ఏడాది వరకు టైం పట్టింది. సాయి ధరమ్ తేజ్.. కల్మషం లేని మనిషి అని అంతా అంటుంటారు.
బహుశా అదే అతన్ని త్వరగా కోలుకునేలా చేసుకునేలా చేసి ఉండొచ్చు. తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి ‘విరూపాక్ష’ (Virupaksha) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇమేజ్ కి స్టిక్ అయిపోయి ఒకే జోనర్లో ఇతను సినిమాలు చేసింది లేదు. ‘జవాన్’ (Jawaan) ‘రిపబ్లిక్’ (Republic) వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించాడు.
అలాగే తన ఇమేజ్ ను పక్కన పెట్టి ‘సత్య’ అనే షార్ట్ ఫిలింలో కూడా నటించాడు. అదే టైం అతని పేరు సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నాడు. అతని తల్లిపై ఉన్న ప్రేమను సాయి తేజ్ అలా చాటిచెప్పడం జరిగింది. ప్రస్తుతం అతను ‘హనుమాన్’ (Hanu Man) నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే కావడం విశేషం.