Sai Dharam Tej: ఇంటర్వ్యూ : ‘విరూపాక్ష’ గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • April 19, 2023 / 06:36 PM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం గురించి సాయి ధరమ్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ విశేషాలు మీకోసం :

ప్ర. ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్లకు ఎక్కువగా పంచెకట్టులో హాజరవుతున్నారేంటి?

సాయి ధరమ్ తేజ్ : ‘విరూపాక్ష’ అనేది పాన్ ఇండియా సినిమా కదా.! తెలుగు సినిమా మాత్రమే కాదు తెలుగు వారి సంప్రదాయం దేశం మొత్తం తెలుసుకోవాలని ఇలా పంచెకట్టులో వచ్చి ప్రమోట్ చేస్తున్నాను.

ప్ర.’విరూపాక్ష’ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టడానికి కారణం ఏంటి?

సాయి ధరమ్ తేజ్ : ‘విరూపాక్ష’ అంటే రూపం లేని కన్ను. శివుడు మూడో కన్ను. దాంతోనే హీరో ఫైట్ చేస్తుంటాడు. దాని వెనుక ఉన్న కథేంటి.. అన్నది ‘విరూపాక్ష’ కథ.

ప్ర.’విరూపాక్ష’ థీమ్ ఏంటి?

సాయి ధరమ్ తేజ్ : ‘విరూపాక్ష’ చిత్రం 1989 నుండి 1991 వరకు ‘రుద్రవనం’ అనే ఒక ఊరిలో జరిగే కథ. ఆ ఊరిపై చేతబడి చేస్తారు.దీంతో అక్కడ చాలా మంది మరణిస్తూ ఉంటారు. ఆ ఊరి పై చేతబడి చేసింది ఎవరు ? ఎందుకు చేశారు? తర్వాత ఏమైంది. హారర్ ఎలిమెంట్స్ ఆ గ్రామంలో మిస్టరీ ఎలా ట్రావెల్ చేశాయి అనేది మెయిన్ కథ.

ప్ర.పెద్ద యాక్సిడెంట్ తర్వాత ‘విరూపాక్ష’ అనే పెద్ద సినిమాలో నటించారు.. ఇది పెద్ద ఛాలెంజ్ అని ఏమైనా ఫీలయ్యారా?

సాయి ధరమ్ తేజ్ : నిజంగా ఛాలెంజే..! ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో చేసిన పాత్రల్లో జీవించాను. కానీ ‘విరూపాక్ష’ లో చేసిన సూర్య పాత్రలో నటించాను.నటుడు అనేవాడికి ప్రతి సినిమా మొదటి సినిమా లాంటిదే. మొదటి సినిమాకి కష్టపడినట్టుగానే అన్ని సినిమాలకి కష్టపడాలి. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా నాకు ఛాలెంజ్‌గా నిలిచింది. యాక్సిడెంట్ కారణంగా నటన పరంగా ఏమీ తేడా జరగలేదు. కాకపోతే నాకు నేనుగా బెటర్ అయ్యేందుకు ప్రయత్నించాను. కొన్ని రోజులు టైం పట్టింది.

ప్ర.’కాంతార’ సినిమాకి దీనికి ఏమైనా పోలికలు ఉంటాయా?

సాయి ధరమ్ తేజ్ : అసలు దానికి.. దీనికి పోలికలు అంటూ లేవు. అది ఓ కల్ట్ క్లాసిక్. ‘విరూపాక్ష’ కూడా క్లాసిక్ గా నిలుస్తుంది అనుకుంటున్నాం. ‘ఇండియానా జోన్స్’ సినిమా మాదిరిగా ఉంటుంది అనుకోవచ్చు.

ప్ర.దర్శకుడు కార్తీక్ దండు తో పనిచేయడం ఎలా అనిపించింది?

సాయి ధరమ్ తేజ్ : అతను కథ చెబుతున్నప్పుడు చాలా భయమేసింది. నేను హర్రర్ సినిమాలు అంటే భయం. ఆయన కథ చెబుతున్న 10 నిమిషాలకే నాకు భయం స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 21 న థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటున్నాను.

ప్ర. ‘ఎస్విసిసి’ బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నారు ఎలా అనిపించింది?

సాయి ధరమ్ తేజ్ : మూడో సినిమా కూడా చేస్తున్నాను అండీ!(నవ్వుతూ) బాపినీడు అన్న నాకు మంచి స్నేహితుడు. మేము కలిసి క్రికెట్ ఆడుతుంటాం. ఈ బ్యానర్లో సినిమా చేయడం నాకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

ప్ర. మీ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టారట నిర్మాత.. నిజమేనా?

సాయి ధరమ్ తేజ్ : అది నాకు తెలీదు. నేను మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలి అనుకుంటాను. బడ్జెట్, కలెక్షన్లు వంటి లెక్కలు నేను వేసుకోను.

ప్ర. సుకుమార్ గారు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. మీకు ఆయనతో పనిచేయడం ఎలా అనిపించింది?

సాయి ధరమ్ తేజ్ : ‘సుకుమార్ రైటింగ్స్’ లో సుకుమార్ గారు ఎక్కువగా ప్రేమకథలకి పనిచేశారు. కానీ ఈసారి హారర్ జోనర్ సినిమా ఈ బ్యానర్లో చేయడం జరిగింది. ఈ సినిమాకు సుకుమార్ గారు రాసిన స్క్రీన్ ప్లే హైలెట్ అని చెప్పాలి. ప్రతి 10 నిమిషాలకు ఓ కొత్త క్యారెక్టర్ వస్తుంది. కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వర్క్ షాప్ జరిగేటప్పుడు చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. చాలా విషయాలు చెప్పారు. యాక్సిడెంట్ తర్వాత నేను సెట్లోకి వెళ్లిన మూడో రోజే నార్మల్ అయ్యాను అంటే అది ఆయన వల్లే అని చెప్పాలి.

ప్ర. సంయుక్త మీనన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

సాయి ధరమ్ తేజ్ : సంయుక్త మీనన్.. నందిని అనే పాత్రలో చాలా బాగా నటించింది. చాలా మిస్టీరియస్ గా ఆ పాత్ర ఉంటుంది.

ప్ర. సంగీత దర్శకుడు బి.అజనీష్ లోకనాథ్ గురించి చెప్పండి?

సాయి ధరమ్ తేజ్ : పాటలకు చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమా ఇది. కానీ బి.అజనీష్ లోకనాథ్ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడు.

ప్ర. ‘వినోదయ సీతమ్’ రీమేక్ ఎలా ఉండబోతుంది?

సాయి ధరమ్ తేజ్ : జూలై 28 న మీకు క్లారిటీ వచ్చేస్తుంది(నవ్వుతూ)

ప్ర.వేరే హీరోలతో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉందా? గతంలో మంచు మనోజ్ తో ‘బిల్లా రంగా’ రీమేక్ చేస్తాను అన్నారుగా?

సాయి ధరమ్ : ‘బిల్లా రంగా’ చేస్తాము అని చెప్పాము. కానీ కథ దొరకట్లేదు. కథ సెట్ అయితే చేసేస్తాం. మల్టీస్టారర్ ప్రాజెక్టులకు కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus