పాన్ ఇండియా సినిమాలకి వరల్డ్ క్రియేట్ చేయడం రాజమౌళి (S. S. Rajamouli) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) నేర్పిస్తే.. యూనివర్స్ క్రియేట్ చేయడం అనేది తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నేర్పించాడు. చిన్న, మిడ్ రేంజ్ హీరోల ఇమేజ్ తో సంబంధం లేకుండా ఈ వరల్డ్ బిల్డింగ్.. అక్కడ జనాల సామర్థ్యం వంటివి ఆడియన్స్ కి కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. ప్రస్తుతం సౌత్ లో ఉన్న దర్శకులంతా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఈ లిస్టులో శైలేష్ కొలను (Sailesh Kolanu) వంటి మిడ్ రేంజ్ దర్శకులు కూడా ఉన్నారు.
తాజాగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) కూడా చేరినట్టు స్పష్టమవుతుంది. ‘భమ్ భోలేనాథ్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అతను.. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘విరూపాక్ష’ (Virupaksha) అనే సినిమా చేశాడు. బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమా ఇది. సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej) అలియాస్ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పట్లో అది వర్కౌట్ అవ్వడం కష్టమే.
అందుకే నాగ చైతన్యతో (Naga Chaitanya) ఒక సినిమా సెట్ చేసుకున్నాడు కార్తీక్. ఇది కూడా బ్లాక్ మ్యాజిక్ తో సాగే మిస్టికల్ థ్రిల్లర్ అని సమాచారం. ఇందులో నిధి అన్వేషణ కోసం సాహసాలు చేసే హీరోగా నాగ చైతన్య కనిపిస్తాడట. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం సాయి దుర్గ తేజ్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. ‘విరూపాక్ష’ లోని సూర్య పాత్రనే ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తూ తేజు పాత్ర ఉంటుందని టాక్.