అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, “అ ఆ”… ఈ మూడు సినిమాలకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. కథా నాయిక కూడా ఒకరే. ఆమె సమంత. ఒకే డైరెక్టర్ సినిమాలో వరుసగా మూడు సినిమాల్లో అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది కాబట్టే హీరోలు మారినా హీరోయిన్ స్థానంలో సమంత నిలబడింది. తాజా చిత్రం “అ ఆ”లో తన నటన గురించి సమంత ఇలా చెప్పారు.
“నేను ఇక లవ్ స్టోరీలు చేయను. ఎందుకంటే ప్రేమ కథలకు కావలసిన నటన అంతా “అ ఆ” సినిమాలోనే చూపించాను. ఇంకా నా దగ్గర ఏమి లేదు. ఈ సినిమా క్లైమాక్స్ లో చేసిన సీన్ .. నా కెరీర్ లో టఫ్ఫస్ట్ సీన్. ఎందుకంటే నా చుట్టూ ఫుల్ కామెడీ జరుగుతుంటుంది. నేను మాత్రం కోపంగా ఉండాలి. కన్నీళ్లు పెట్టుకోవాలి. పోసాని గారు ఆ సీన్లో బాగా నవ్విస్తున్నారు.. అయన నటనకి నాకు నవ్వు ఆగడం లేదు. వద్దు వద్దు నవ్వొద్దు అని నాకు నేనే కారు సీట్ ని గట్టిగా పట్టుకుని సీరియస్ గా నటించాను. అప్పుడు డైరెక్టర్ సార్ వచ్చి.. “నువ్వు మంచి నటివి అని ఈ రోజు ప్రూవ్ చేసావు. కంగ్రాట్స్” అని చెప్పారు” అని సమంత షూటింగ్ సంగతులను ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.
“అ ఆ” సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ 2న రిలీజ్ కావడానికి సిద్ధమైంది. త్రివిక్రమ్ కాంబి నేషన్లో సమంత హ్యాట్రిక్ హిట్ కొడుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.