స్టార్ హీరోయిన్ సమంత వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత అభినయ ప్రధాన పాత్రలను ఎంచుకుంటున్న సమంత రాజ్ & డీకే డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో ఉగ్రవాది పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ వెబ్ సిరీస్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.
ఇటీవల ఫ్యామిలీ మేన్2 ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలు తమిళుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయనే కామెంట్లు వినిపించాయి. సమంత పాత్రను ట్రోల్ చేస్తూ కొంతమంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ట్రోలింగ్ పెరగడంతో అమెజాన్ ప్రైమ్ ట్రైలర్ లో స్వల్ప మార్పులు చేసి యూట్యూబ్ లో మార్చిన ట్రైలర్ ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ వివాదం గురించి సమంత స్పందించారు. “ప్రశాంతంగా ఉండండి మరియు విశ్వాసం కలిగి ఉండండి” అని ఇంగ్లీష్ లో ఉన్న ఫోటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమిళ తంబీలు ట్రైలర్ చూసి హర్ట్ కావడంతో ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సీన్లకు కత్తెర పడనుందని వినిపిస్తోంది. కొన్ని సన్నివేశాలను తొలగించకపోతే సినిమా రిలీజైన తరువాత వివాదం మరింత పెద్దదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత పర్ఫామెన్స్ ఈ వెబ్ సిరీస్ కు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.